అజిత్ తో అనుష్క మరోసారి..

23 Mar, 2016 03:04 IST|Sakshi
అజిత్ తో అనుష్క మరోసారి..

అజిత్‌తో మరోసారి జత కట్టడానికి అందాల తార అనుష్క సిద్ధమవుతున్నారా? దీనికి కోలీవుడ్ నుంచి అవుననే సమాధానమే వస్తోంది. సూపర్‌స్టార్స్ రజనీకాంత్, కమలహాసన్‌ల తరువాత కోలీవుడ్‌లో అంతటి ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ విజయ్, అజిత్‌లేనని ఏమాత్రం సందేహం లేకుండా చెప్పవచ్చు.అలాంటి వారితో జత కట్టడానికి ప్రముఖ నటీమణులు ఆశ పడుతుంటారు. అందుకు తమ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటీవల నటి తమన్నా అలాంటి ప్రయత్నాన్నే చేసినట్లు ప్రచారం జరిగింది. తమన్నా అజిత్‌తో కలిసి వీరం చిత్రంలో నటించారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.

అజిత్ వేదాళం తరువాత తన 57వ చిత్రానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.ఇందులో హీరోయిన్‌గా నటించాలన్న ఆకాంక్షను తమన్న వ్యక్తం చేసినట్లు సమాచారం. మరో సారి అజిత్‌తో నటిస్తానని తనే ఇటీవల వెల్లడించారు. దీంతో అజిత్ తాజా చిత్రంలో హీరోయిన్‌గా  తమన్నా ఎంపికయ్యిందేమోన ని అనుకున్న వారూ లేక పోలేదు. అయితే అజిత్ తాజా చిత్రంలో నటించే అవకాశం తమన్నాకు దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. ఆ అవకాశాన్ని స్వీటీ(అనుష్క)తన్నుకుపోయినట్లు తాజా సమాచారం.అనుష్క ఎన్నై అరిందాల్ చిత్రంలో తొలి సారిగా అజిత్ తో నటించారు.

అయితే ఆ చిత్రంలో ఆయనతో అంతగా రొమాన్స్ చేసే అవకాశం లభించలేదు. అజిత్ 57వ చిత్రం మరోసారి ఫుల్‌ప్లెజ్డ్ హీరోయిన్‌గా నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వీరం, వేదాళం చిత్రాల దర్శకుడు శివనే అజిత్ తాజా చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం మే నెలలో సెట్‌పైకి రానున్నదని తెలుస్తోంది. వేదాళం చిత్రానికి సంగీత బాణీలు అందించిన అనిరుద్‌నే దీనికి సంగీతాన్ని అందించనున్నారు. అనుష్క ప్రస్తుతం బాహుబలి-2, ఎస్-3 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.