షూటింగ్‌లకు సీఎం జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌: చిరు

9 Jun, 2020 16:29 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో కూడా సినిమా షూటింగ్‌లు జరుపుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనుమతిచ్చారని మెగాస్టార్‌ చిరంజీవి తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. సీఎం జగన్‌తో జరిగిన ఈ భేటిలో చిరంజీవితో పాటు మంత్రి పేర్ని నాని, టాలీవుడ్‌ ప్రముఖులు నాగార్జున, దిల్‌ రాజు, త్రివిక్రమ్‌, రాజమౌళి, సురేశ్‌ బాబు, సి, కళ్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.  దాదాపు అరగంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో ముఖ్యంగా సినీ పరిశ్రమ అభివృద్దిపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం మెగాస్టార్‌ చిరంజీవి మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా సినిమా షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అయితే ఇక్కడ కూడా సీఎం జగన్‌ షూటింగ్‌లకు అనుమతి ఇవ్వడం సంతోషకరమన్నారు.  (లైట్స్‌.. కెమెరా.. యాక్షన్)‌

‘టాలీవుడ్‌ ప్రముఖలంతా ఏడాది కాలంగా సీఎం జగన్‌ను కలవాలని అనుకున్నాం.. కానీ కుదరలేదు. ఈ రోజు కలిశాం. ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. ఏపీలోనూ షూటింగ్‌లకు అనుమతిచ్చారు. థియేటర్లలో మినిమం ఫిక్స్‌డ్‌ ఛార్జీలు ఎత్తేయాలని కోరాం. నంది వేడుకలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి మేము ప్రోత్సాహం కోరుకుంటాం. 2019-20కి అవార్డుల వేడుక జరుగుతుందని భావిస్తున్నాం. టికెట్ల ధరల ఫ్లెక్సీ రేట్లపై దృష్టి పెట్టాలని కోరాం. పరిశీలిస్తామని సీఎం జగన్‌ అన్నారు. అదే జరిగితే పారదర్శకత ఉంటుంది. మాకు చాలా మేలు జరుగుతుంది. తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్దికి తాను వెన్నంటి ఉంటానని సీఎం చెప్పడం మాకు ఆనందం కలిగించింది. విశాఖపట్నంలో స్టూడియోకు దివంగత మహానేత వైఎస్సార్‌ భూమి ఇచ్చారు. అక్కడ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాం’ అని చిరంజీవి పేర్కొన్నారు.  


‘కేంద్రం అనుమతిచ్చాకే థియేటర్లు తెరుస్తాం’
తెలుగు సినీ పరిశ్రమకు తోడుగా ఉంటామని మంత్రి పేర్ని పేర్కొన్నారు. జులై 15 తర్వాత సినిమా షూటింగ్‌లు జరుపుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. సీఎం జగన్‌తో సినీ పెద్దల సమావేశం అనంతరం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. థియేటర్ల మినిమం ఫిక్స్‌డ్‌ఛార్జీలు ఎత్తివేయాలని సినీ పెద్దలు కోరిన అంశాన్ని పరిశీలిస్తామన్నారు. సినిమా టికెట్లను ఆన్‌లైన్‌ చేసే ఆలోచన చేస్తున్నామన్నారు. కేంద్రం అనుమతి ఇచ్చికే థియేటర్లు తెరుస్తామన్నారు. 2019-20 నంది అవార్డులకు విధివిధానాలు రూపొందించాలని సీఎం జగన్‌ ఆదేశించారన్నారు. చిన్న సినిమాల రాయితీల విడుదలకు సీఎం ఆదేశించనట్లు తెలిపారు. విశాఖపట్నంలో సెటిల్‌ అవ్వాలనుకునేవారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. 


 

మరిన్ని వార్తలు