ఆయుష్మాన్‌ భవ!

17 Apr, 2020 07:56 IST|Sakshi

కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి సినీ తారలంతా వారికి తోచిన మార్గంలో ప్రచారం చేస్తున్నారు. ఆపదలో, అవసరంలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరం కరోనా మహమ్మారి కారణంగా నిరాశానిస్పృహలతో విచారంగా ఉంటున్నాం. ఏ క్షణాన ఎవరిని కబళిస్తుందోననే భయం వెంటాడుతూనే ఉంది. ‘ఇటువంటి సమయంలోనే అందరం ఆశావహ దృక్పథంలో ఉండాలి, మంచి మంచి కథలు వినాలి’ అంటున్నారు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, దర్శకుడు  ఆయుష్మాన్‌ ఖురానా. ఈ విపత్కర సమయంలో ఈ మహమ్మారిమీద పోరాటం చేస్తున్న ‘ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌’ కథలను మనమందరం తప్పకుండా వింటూ ప్రేరణ పొందాలి అంటున్నారు ఆయుష్మాన్‌. తనవంతుగా, అటువంటి వారిని స్మరిస్తూ వారి మీద ఒక ఓడ్‌ (ఇంగ్లీషులో ఒక ఛందస్సు) రచించి, తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ప్రాణాలను పణంగా పెట్టి, కరోనా మీద అహర్నిశలూ పోరాడుతూ, మన కోసం, మన కుటుంబాల కోసం నిరంతరం శ్రమిస్తున్న వారికి ఈ పాటను అంకితం చేశారు. ‘వారికి వందనం చేస్తూ, వారికి నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను’ అంటున్నారు ఆయుష్మాన్‌.

‘వీధులను శుభ్రం చేసేవారు, చెత్తను ఎత్తిపారేసేవారు, నిత్యావసరాలను మన ఇళ్లకు తీసుకువచ్చిన తరవాతే వారి ఇళ్లకు వెళ్తున్నవారు అందరికీ నమస్కరిస్తున్నాను. మనం కనీసం వారికి గౌరవం కూడా ఇవ్వం. వారి నుంచి కరోనా వ్యాధి మన పిల్లలకు వస్తుందేమోనని కనీసం వారిని ముట్టుకోవటానికి కూడా ఇష్టపడం.

ఈ సమయంలో  మనకు అతి నిరుపేదలు సహాయపడుతున్నారు. ఈ మహమ్మారి కనుమరుగయ్యాక, మనమంతా వారిని గౌరవించుకుందాం. ఏ పనీ చిన్నది కాదని అర్థం చేసుకోవాలి. డాక్టర్లు, నర్సులు, పోలీసులు, సెక్యూరిటీ గార్డులు వీరే మనకు ఈ విపత్కర సమయంలో భగవంతుడితో సమానులు. మాలాంటి బాలీవుడ్‌ హీరోలు కేవలం నామమాత్రులు మాత్రమే’ అంటూ ఈ పాటలో ఆయుష్మాన్‌ అంటున్నారు. ‘ప్రజలంతా ఇంటి దగ్గరే ఉంటూ, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కి సహకరిద్దాం’ అంటూ తన పాటను ముగించారు ఆయుష్మాన్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు