బాలీవుడ్‌లో శ్రీదేవీకి గళమిచ్చింది ఈమెనే!

26 Feb, 2018 14:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తమిళ సినిమా ద్వారా తొలిసారిగా వెండితెరకు పరిచయమై మలయాళం, కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో కొన్ని వందల చిత్రాల్లో హీరోయిన్గా వెలుగులు విరజిమ్మిన ప్రముఖ నటి శ్రీదేవీ బాలీవుడ్కు మాత్రం 1979లో ‘సోల్వా సావన్’ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. శ్రీదేవీ హీరోయిన్గా 1977లో తమిళంలో ‘16 వయతినిల్లీ’ చిత్రాన్ని తీసిన ప్రముఖ దర్శకుడు భారతీరాజానే రెండేళ్ల తర్వాత బాలివుడ్ నటుడు అమోల్ పాలేకర్, శ్రీదేవి కాంబినేషన్లో సోల్వా సావన్ చిత్రాన్ని తీశారు. అంతకుముందు కే. రాఘవేంద్రరావు 1978లో శ్రీదేవీతో ‘16 ఏళ్ల వయస్సు’ పేరిట తెలుగులో తీశారు. తెలుగు, తమిళంలో సూపర్ డూపర్ ఇట్టయిన ఈ చిత్రం బాలీవుడ్లో మాత్రం రాణించలేకపోయింది.

సోల్వా సావన్ చిత్రంలో శ్రీదేవీకి ప్రముఖ హిందీ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ బేబీ నాజ్ డబ్బింగ్ చెప్పారు. 1979 నుంచి 1989 వరకు హిందీలో శ్రీదేవీ నటించిన చిత్రాలకు బీబీ నాజ్యే ఎక్కువగా డబ్బింగ్ చెప్పారు. ‘ఆఖరీ రాస్తా’లో సినీ నటి రేఖ డబ్బింగ్ చెప్పారు.  1989లో వచ్చిన ‘చాందినీ’ చిత్రం నుంచే శ్రీదేవీ సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం ప్రారంభించారు. శ్రీదేవీ లాగానే బీబీ నాజ్ చిన్నప్పటి నుంచే హిందీ చిత్రాల్లో నటిస్తూ వచ్చారు. అప్పుడు అందరు ఆ బాలికను బేబీ నాజ్ అని పిలిచేవారు. అదే పేరు ఆమెకు చివరి వరకు స్థిరపడి పోయింది. బేబీ నాజ్ 1944లో ముంబైలో జన్నించారు. అప్పుడు ఆమె పేరు సల్మా బేగ్. ఆమె తన నాలుగవ ఏటా బేబీ నాజ్ పేరుతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.

1954లో వచ్చిన ‘బూట్ పాలిష్’ చిత్రంలో నటనకుగాను బేబీ నాజ్కు కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రత్యేక ప్రశంసా పురస్కారం లభించింది. 1955లో బిమల్ రాయ్ తీసిన ‘దేవదాస్’, 1957లో హషికేష్ ముఖర్జీ తీసిన ‘ముసాఫిర్’, 1958లో ఆయనే తీసిన ‘లజ్వంతి’, 1959లో గురుదత్ తీసిన ‘కాగజ్ కే ఫూల్’ తీసిన చిత్రాల్లో నటించిన బేబీ నాజ్ హీరోయిన్గా కాకుండా ఎక్కువ వరకు సహ పాత్రలకే పరిమితం అయ్యారు. చివరకు డబ్బింగ్ ఆర్టిస్ట్గానే మిగిలిపోయి 1995, అక్టోబర్లో కన్నుమూశారు. శ్రీదేవీ గొంతు ఇప్పుడు శాశ్వతంగా మూగపోగా ఆమెకు పదేళ్లపాటు గొంతునిచ్చిన నాజ్ గొంతు 23 ఏళ్ల క్రితమే మూగపోయింది.

మరిన్ని వార్తలు