నా సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించిన శ్రీదేవి..నా పక్కన హీరోయిన్‌గా చేస్తుందని ఊహించలేదు: చంద్రమోహన్‌

11 Nov, 2023 19:19 IST|Sakshi

చంద్రమోహన్‌ మరణంతో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా తనదైన సహజ నటనతో ఆకట్టుకున్న చంద్రమోహన్‌.. నేడు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. అనారోగ్యంతో శనివారం (నవంబర్‌ 11) తుది శ్వాస విడిచారు. తన 55 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎంతోమంది హీరోయిన్లను స్టార్స్‌ని చేశారు.వారిలో దివంగత నటి, అందాల తార శ్రీదేవి కూడా ఉన్నారు. ఆమె గురించి గతంలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు చంద్రమోహన్‌.  శ్రీదేవి మరణించిన రోజు(2018)  ‘సాక్షి’తో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆ రోజు చంద్రమోహన్‌ శ్రీదేవి గురించి ఏం చెప్పారో ఆయన మాటల్లోనే .. (ఇది 2018లో శ్రీదేశి మరణించిన రోజు చంద్రమోహన్‌ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ)

శ్రీదేవిగారికి తెలుగులో మీరు ఫస్ట్‌ హీరో. ‘పదహారేళ్ల వయసులో’ మీ ఇద్దరు జంటగా చేసినప్పటి జ్ఞాపకాలు పంచుకుంటారా?
చంద్రమోహన్‌: ఆ సినిమాకి శ్రీదేవిని హీరోయిన్‌గా తీసుకుందామని అనుకున్నప్పుడు కొందరు నిర్మాతలు వ్యతిరేకించారు. కానీ కమల్‌హాసన్‌తో ఇదే సినిమాలో తమిళంలో బాగా చేసిందని రాఘవేంద్రరావుగారు కన్విన్స్‌ చేశారు. నాక్కూడా శ్రీదేవితో చేయడానికి అభ్యంతరం అనిపించలేదు. తననే కథానాయికగా తీసుకున్నాం. బ్రహ్మాండంగా నటించింది. హీరోయిన్‌గా అందనంత దూరం వెళ్లిపోయింది.

ఆమె చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా మీతో ఒక సినిమా చేసినట్లున్నారు?
అవును. ‘యశోద కృష్ణ’ సినిమాలో చిన్ని కృష్ణుడు పాత్ర చేసింది. ఆ సినిమాలో నేనేమో నారదుడి పాత్ర చేశాను. అప్పుడు శ్రీదేవికి ఏడెనిమిదేళ్లు ఉంటాయనుకుంటా. ఆ వయసులోనే చాలా క్రమశిక్షణగా ఉండేది. చాలా ముచ్చటేసేది. బిస్కెట్లు తింటూ కూర్చునేది. నా సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చేసిన తను ఆ తర్వాత మూడేళ్లకు నా పక్కన హీరోయిన్‌ (‘పదహారేళ్ల వయసులో)గా చేస్తుందని మాత్రం ఊహించలేదు. అయితే ‘యశోద కృష్ణ’ సినిమా చేస్తున్నప్పుడు తను పెద్ద స్థాయికి వెళుతుందనుకున్నాను.

(చదవండి: నటుడు చంద్రమోహన్‌ మృతికి కారణాలివే!)

బాలనటిగా ఆమె మీ సినిమాలో చేసినప్పుడు జరిగిన సంఘటనలేమైనా గుర్తు చేసుకుంటారా?
‘యశోద కృష్ణ’ చేస్తున్న సమయంలో ఆ అమ్మాయి వేరే తమిళ సినిమా ఒప్పుకుంది. మర్నాడు మద్రాసు వెళ్లాలి. ట్రైన్‌ టికెట్స్‌ దొరకలేదు. అప్పట్లో మేం మద్రాసులో ఉండేవాళ్లం. నా షెడ్యూల్‌ కంప్లీట్‌ అయిపోవడంతో నా కారులో శ్రీదేవిని తీసుకు రావడానికి వీలు పడుతుందా? అని ఆమె అమ్మగారు అడగడంతో సరే అన్నాను. దాదాపు 14 గంటలు జర్నీ చేశాం. ఆ ప్రయాణంలో శ్రీదేవి నా ఒళ్లో నిద్రపోయింది. జాగ్రత్తగా వాళ్ల అమ్మకు అప్పజెప్పాను.

(చదవండి: హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్‌ అయిపోతారు!)

మీతో సినిమా చేయకముందు నుంచే శ్రీదేవిగారి కుటుంబంతో మీకు పరిచయం ఉందా?
మద్రాసు టీ నగర్‌లో మావి పక్క పక్క ఇళ్లే. మా పిల్లలతో శ్రీదేవి ఆడుకునేది. వాళ్ల అమ్మగారికి కూతుర్ని పెద్ద హీరోయిన్‌ని చేయాలని ఉండేది. అమ్మ కలని కూతురు నెరవేర్చింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ.. ఇలా అన్ని భాషల్లోనూ సినిమాలు చేసింది. హిందీలో చాలా బాగా సక్సెస్‌ అయిన మన తెలుగు పిల్ల అని మనందరం గర్వంగా చెప్పుకోవచ్చు. దివి నుంచి భువికి దిగి వచ్చిన సుందరి శ్రీదేవి. తనలా ఎవరూ ఉండరు. పుట్టరు. శ్రీదేవి శ్రీదేవే.

మీ పక్కన ఏ హీరోయిన్‌ యాక్ట్‌ చేసినా ఆ తర్వాత స్టార్‌ అవుతారనే సెంటిమెంట్‌ శ్రీదేవిగారి విషయంలో కూడా నిజమైంది కదా?
అప్పట్లో ఆ సెంటిమెంట్‌ ఉండేది. ‘పదహారేళ్ల వయసులో’ సూపర్‌ డూపర్‌ హిట్టయి శ్రీదేవికి చాలా మంచి పేరొచ్చింది. అప్పుడు తన అమ్మగారు ‘చంద్రమోహన్‌గారి సినిమాతో హీరోయిన్‌గా మా అమ్మాయి అరంగేట్రం అయింది. స్టార్‌ అయిపోయింది’ అనేవారు.జయప్రద, జయసుధ.. ఇలా చాలామంది హీరోయిన్లకు ఆ సెంటిమెంట్‌ని ఆపాదించారు. ‘నాదేం లేదు.. అంతా మీ స్వయంకృషి’ అనేవాణ్ణి. విశేషం ఏంటంటే... తన భర్త బోనీకపూర్‌కి నన్ను పరిచయం చేసినప్పుడు ‘నా ఫస్ట్‌ హీరో’ అని చెప్పింది. ఓసారి నా తెలుగు సినిమా షూటింగ్, అమితాబ్‌ బచ్చన్, శ్రీదేవి చేస్తున్న సినిమా షూటింగ్‌ పక్క పక్కనే జరిగాయి. అప్పుడు అమితాబ్‌కి ‘నా ఫస్ట్‌ హీరో. లక్కీ హీరో’ అని నన్ను పరిచయం చేసింది.

‘పదహారేళ్ల వయసులో’ తమిళ మాతృకలో కమల్‌హాసన్‌గారు చేశారు. ఎప్పుడైనా నటనపరంగా మీ ఇద్దరికీ శ్రీదేవిగారు పోలిక పెట్టారా?
ఆ సినిమా విజయోత్స వేడుకలో నాకన్నా చంద్రమోహన్‌గారు బాగా చేశారు అని కమల్‌హాసన్‌ అన్నారు. ‘నేను తప్ప ఆ క్యారెక్టర్‌ని వేరే ఎవరూ బాగా చేయలేరనుకున్నా. ఆ అభిప్రాయాన్ని వెనక్కి తీసుకుంటున్నా. చంద్రమోహన్‌గారు గొప్పగా నటించారు’ అని కమల్‌గారు అన్నారు. శ్రీదేవి కూడా ఆ మాటే అంది. వాస్తవానికి ‘స్వాతిముత్యం’ సినిమాలో నేనే చేయాల్సింది. ఆ సినిమాలో క్యారెక్టర్‌ కూడా ‘పదహారేళ్ల వయసు’ క్యారెక్టర్‌లానే ఉంటుంది. అయితే ఆ సినిమాని తమిళ్‌లో కూడా ప్లాన్‌ చేశారు. అక్కడ కమల్‌గారికి మార్కెట్‌ ఉంది కాబట్టి, బిజినెస్‌ పాయింటాఫ్‌ వ్యూలో ఆయనతో చేయించాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది.

నటిగా శ్రీదేవిగారిలో ఉన్న మంచి లక్షణాల గురించి?
నేను భానుమతిగారు, సావిత్రిగార్లతో సినిమాలు చేశాను. వాళ్లు చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌ విషయంలో కూడా రాజీపడేవారు కాదు. ఆ లక్షణాలను శ్రీదేవిలో చూశాను. అప్పట్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చేసిన అమ్మాయిలు ఆ తర్వాత శ్రీదేవి స్థాయిలో హీరోయిన్లుగా సక్సెస్‌ కాలేకపోయారు. శ్రీదేవి గొప్ప నటి. ఎన్టీఆర్, ఏయన్నార్, కమల్‌హాసన్, రజనీకాంత్‌.. ఇలా ఎవరి పక్కన చేసినా తన నటన ప్రత్యేకంగా ఉండేది. ఆడియన్స్‌ తననే చూసేంత గొప్పగా నటించేది. అందుకే అన్ని లాంగ్వేజెస్‌లో రాణించగలిగింది.

చివరిసారిగా మీరు ఆమెను ఎప్పుడు కలిశారు?
వైజాగ్‌లో జరిగిన టీయస్సార్‌ అవార్డు ఫంక్షన్‌లో కలిశాం. అప్పుడు సన్నిహితులెవరో ‘నీ ఫస్ట్‌ హీరోయిన్‌ వచ్చారు’ అంటే, ‘నా ఫస్ట్‌ హీరో వచ్చారు’ అని శ్రీదేవి నా దగ్గరకు నవ్వుతూ వచ్చింది. ఎంత స్టార్‌ అయినా తనలో ఎప్పుడూ నేను భేషజం చూడలేదు. నటిగా అందనంత దూరానికి వెళ్లింది. ఇప్పుడు కూడా అందనంత దూరానికి వెళ్లింది. క్షణాల్లో మిస్సయిసోయింది. అని చద్రమోహన్‌ ఎమోషనల్‌కు గురయ్యారు. 

మరిన్ని వార్తలు