5 Aug, 2018 16:29 IST|Sakshi

అనూహ్య పరిణామాలతో బిగ్‌బాస్‌ అలా దూసుకెళ్తోంది. 50 రోజులు దాటిన ఈ కార్యక్రమం జనాల్లోకి బాగానే ఎక్కేసింది. సోషల్‌ మీడియాలో కంటెస్టెంట్‌ల ఫ్యాన్స్‌ రచ్చ మరీ పెరిగిపోతోంది. చివరకు బిగ్‌బాస్‌ షో మొత్తం వన్‌ సైడ్‌గేమ్‌లా వచ్చేట్టు కనిపిస్తోంది. ఇంటి సభ్యులందరిలోకెల్లా డిఫరెంట్‌ యాటిట్యూడ్‌తో ఉండే కౌశల్‌కు సోషల్‌ మీడియాలో భారీ మద్దతు లభిస్తోంది. కౌశల్‌కు సపోర్ట్‌గా లెక్కలేనన్ని పేజీలు క్రియేట్‌ అయ్యాయి. 

వీరంతా కలిసి గేమ్‌ను తమ చేతుల్లోకి తెచ్చుకున్నారు. వీరు ఆడిందే ఆటా పాడిందే పాట అనే స్థాయికి వచ్చేశారు. ఇదివరకే ఈ విషయం ఎన్నో సార్లు బహిర్గతం అయింది. కిరీటీ, భాను, తేజస్వీలను ఎలిమినేట్‌ అయ్యేలా చేసింది వీరే. సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా వీరి హడావిడే కనిపిస్తోంది. గత రెండు వారాల ఎపిసోడ్స్‌లో చాలానే నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 

బాబు గోగినేని, గీతా మాధురి, కౌశల్‌, నందిని, దీప్తి వీరందరి మధ్య జరిగిన గొడవలతో ప్రేక్షకులకు కావలిసినంత మజా దొరికేసింది. ఈ గొడవలపై గత వారం నాని వీరికి క్లాస్‌ కూడా పీకేశాడు. ఇదంతా గతం. కానీ శనివారం నాటి ఎపిసోడ్‌లో ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. హౌజ్‌మేట్స్‌లో ప్రత్యేకంగా ఉండే కౌశల్‌.. నిన్న నాని చేతికి అడ్డంగా దొరికిపోయాడు. టాస్క్‌లో భాగంగా కౌశల్‌, నందిని మధ్య జరిగిన సంభాషణను మళ్లీ ప్లే చేశాడు. దీంతో కౌశల్‌ తెల్లబోయాడు. అప్పటి వరకు తనకు తాను సమర్దించుకుంటూ చెప్పిన మాటలకు.. వీడియోలో చూపించిన దానికి భిన్నంగా ఉండటంతో కౌశల్‌ మాటమార్చేశాడు. 

ఇలా కౌశల్‌ అడ్డంగా దొరికేసరికి.. నాని కాస్త మందలించాడు. తనకు బయట చాలా మంది ఫాలోవర్స్‌ ఉన్నారని, చాలా సపోర్ట్‌ చేస్తున్నారని, అలా గేమ్‌ ప్లే చేసి.. ఫ్లిప్‌ అవుతూ ఉంటే.. బయట ఫ్యాన్స్‌ కూడా ఫ్లిఫ్‌ అవుతారంటూ కౌశల్‌ను హెచ్చరించాడు. కౌశల్‌ నిజాలే మాట్లాడుతాడని, ధైర్యంగా ఏదైనా చెప్పగలడని, తన​ వ్యక్తిత్వానికి సోషల్‌ మీడియాలో భారీగానే ఫాలోయింగ్‌ పెరిగింది. 

ఒకరకంగా చెప్పాలంటే షో దశాదిశను నిర్ణయించేది కౌశల్‌ ఫాలోవర్సే అనేంత వరకు వచ్చింది. ఎలిమినేట్‌ అయిన ఆరుగురు కంటెస్టెంట్లను తిరిగి ఇంటిలోకి పంపించే అవకాశం వస్తే.. యాక్టివ్‌గా ఉండే తేజస్వీ, ఎందరినో ఆకట్టుకున్న భాను శ్రీలు కాకుండా రెండో వారమే ఎలిమినేట్‌ అయిన నూతన్‌ నాయుడును ఇంటిలోకి తిరిగి పంపారు. ఎందుకంటే భాను, తేజస్వీలు తరుచూ గొడవ పడుతుంటారు. కౌశల్‌ అంటేనే గిట్టదన్నట్టుగా వ్యవహరించేవారు. దీంతో కౌశల్‌ ఫాలోవర్స్‌.. ఆయనతో సన్నిహితంగా ఉండే నూతన్‌ నాయుడిని ఇంట్లోకి పంపించారు. ఎలాంటి ఫాలోయింగ్‌ లేని నూతన్‌ ఎలా రీఎంట్రీ ఇచ్చాడని ఇంటి సభ్యులు కూడా మాట్లాడుకోవడం మనం చూశాం. కానీ వారికి తెలీదు కదా.. బయట ఒక ఆర్మీ ఉందని. 

సో.. ఇక ఆదివారం ఉదయం నుంచే నందిని ఎలిమినేట్‌ కాబోతోంది అని ప్రచారం సాగింది. ఈ మధ్య నందిని డబుల్‌ గేమ్‌ప్లే చేస్తోందని, కావాలనే కౌశల్‌ను టార్గెట్‌ చేస్తోందంటూ సోషల్‌ మీడియాలో ఆమెపై నెగెటివిటీ ఎక్కువైంది. తనీష్‌తో క్లోజ్‌ అవడం.. వారిద్దరు కలిసి చేసే ఎక్సాట్రాలు.. నాని కూడా ఈ విషయంపై తరచూ అడగడం చూస్తూనే ఉన్నాం. సోషల్‌ మీడియాలో నందినిపై పెరుగుతోన్న నెగెటివిటీ కూడా ఎలిమినేషన్‌కు కారణమైంది. ఎలిమినేట్‌ అయిన నందినికి.. హౌజ్‌లోని ఓ ఇద్దరితో మాట్లాడడానికి నాని అవకాశమిచ్చాడు. గీతా మాధురి, దీప్తిలతో తను మాట్లాడిన అనంతరం.. బిగ్‌ బాంబ్‌ వేయాల్సిన సమయం వచ్చిందంటూ.. గార్డెన్‌ ఏరియాలో రాబోయే వారంపాటు ఓ మసాజ్‌ పార్లర్‌ ఉంటుందని.. హౌజ్‌ మేట్స్‌ అందరికీ హెడ్‌ మసాజ్‌ చేస్తూ.. ఇంట్లో ఉండే సమస్యల గురించి మాట్లాడలని ఇదే ఈ వారం బిగ్‌బాంబ్‌ అంటూ నాని పేల్చేశాడు. ఇక ఈ బిగ్‌బాంబ్‌ను రోల్‌ రైడాపై నందిని వేసింది. 

సోమవారం జరిగే షోలో.. ఎలిమినేషన్‌ ప్రక్రియ షురూ అయింది. మరి తొమ్మిదో వారం బిగ్‌బాస్‌ కార్యక్రమంలో ఏం జరుగనుందో.. ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో.. చూద్దాం.. ఏదైనా జరుగొచ్చు! ఎందుకంటే...ఇది బిగ్‌బాస్‌. 

మరిన్ని వార్తలు