ఉత్తమిగా మారుతున్న జూలి

13 Jan, 2018 04:59 IST|Sakshi

తమిళసినిమా: నటి జూలి ఉత్తమిగా మారుతోందట. అదేంటి  ఉత్తమిగా మారడం ఏమిటి? అనే ప్రశ్న తలెత్తుతోందా? అయితే ఆ కథేంటో చూద్దాం రండి. ఏ రంగంలోనైనా, ఏ విషయానికైనా ప్రచారం చాలా ముఖ్యం. అలాంటి ప్రచారాన్ని కొందరు సొంతంగా ఖర్చు చేసి పొందుతుంటారు. మరికొందరికి అదే వెతుక్కుంటూ వస్తుంది. అలా మంచి పాపులారిటీని బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షో తెచ్చిపెట్టింది. అందులో ఒకరు నటి జూలి. అందులో పాల్గొన్న వారిలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్న ఈ బ్యూటీ అంతకు ముందే జల్లికట్టు పోరాటంలో పాల్గొని వెలుగులోకి వచ్చింది. ఆపై ఒక టీవీ చానల్‌లో యాంకర్‌గా పనిచేశారు.

ఇవన్నీ కలిపి జూలీని సినిమా హీరోయిన్‌ను చేసేశాయి. అలా బిగ్‌బాస్‌ షో తరువాత హీరోయిన్‌గా అవకాశం అందుకున్న ఓవియ తరువాత ఆ లిస్ట్‌లో నటి జూలి చేరింది. త్వరలో ఈ అమ్మడు నటించనున్న చిత్రం ప్రారంభం కానుంది. ఆమెతో పాటు ప్రధాన పాత్రలో పబ్లిక్‌స్టార్‌ దురై సుధాకర్‌ నటిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు జూలీయుమ్‌ 4 పేరుమ్‌ చిత్రాల్లో నటించారన్నది గమనార్హం. ఈ చిత్రానికి ఉత్తమి అనే టైటిల్‌ను నిర్ణయించారట. ఈ చిత్ర కథ జూలీ పాత్ర చుట్టూ తిరుగుతుందట. తొలి చిత్రంతోనే శక్తివంతమైన పాత్రలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందంటోంది నటి జూలి. కాగా కే 7 ప్రొడక్షన్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఇవి ప్రస్తుతానికి ఉత్తమి చిత్ర వివరాలు. త్వరలో పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు