భారతీయ సినిమా వందేళ్లు పూర్తి

1 Jul, 2013 03:47 IST|Sakshi
భారతీయ సినిమా వందేళ్లు పూర్తి
 భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నూరేళ్ల సినిమా వేడుకను ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో జరిగే ఈ భారీ వేడుకకు చెన్నయ్ వేదికగా నిలువనుంది. దక్షిణభారత చలనచిత్ర పరిశ్రమ యావత్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. ఈ కార్యక్రమం వివరాల్ని తెలిపేందుకు ఆదివారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 
 
 దక్షిణభారత చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ మాట్లాడుతూ-‘‘మూడ్రోజులు జరిగే ఈ కార్యక్రమంలో మొదటి రెండు రోజులూ సౌతిండియాకు చెందిన సినీ ప్రముఖుల సత్కార కార్యక్రమాలు జరుగుతాయి. మూడో రోజు మాత్రం 18 భాషలకు చెందిన చిత్ర ప్రముఖుల్ని ఒకే వేదికపైకి తెచ్చి సత్కరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వారం రోజులు ముందు హైదరాబాద్‌లో భారతీయ సినిమాకు చెందిన ఓ ఎగ్జిబిషన్‌ని ఏర్పాటు చేస్తాం. 
 
 అందులో వందేళ్ల సినిమా వింతలూ విశేషాలూ పలు సినిమాల వివరాలు పొందుపరుస్తాం. భారతీయ సినీ పరిశ్రమ యావత్తూ జరుపుకోవాల్సిన పండగ ఇది. అందుకే ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 3 వరకూ చిత్ర పరిశ్రమలకు సెలవు ప్రకటించడం జరిగింది. 
 
 ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ కావాలని ఆశిస్తున్నాం’’ అన్నారు. వజ్రోత్సవాలను మరపించేలా ఈ కార్యక్రమం ఉండబోతోందని తమ్మారెడ్డి  భరద్వాజ్ చెప్పారు. దక్షిణభారతానికి చెందిన చలనచిత్ర పరిశ్రమలన్నీ కలిసి ఈ కార్యక్రమం చేయడం పట్ల కేఎస్ రామారావు ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి గొప్ప కార్యక్రమానికి ఇన్‌ఛార్జిగా వ్యవహరించడం పట్ల తమిళ నిర్మాత రవి కొట్టార్కర సంతోషం వెలిబుచ్చారు.