దండుపాళ్యం4కి సెన్సార్‌ షాక్‌

21 Jan, 2019 12:13 IST|Sakshi

సర్టిఫికెట్‌ మంజూరుకు నో

కర్ణాటక , యశవంతపుర: బెంగళూరు సమీపంలోని దండుపాళ్యకు చెందిన దోపిడీదొంగల స్వైర విహారానికి దృశ్యరూపమైన దండుపాళ్యం సినిమాల గురించి తెలియనివారుండరు. అందులో 4వ చిత్రానికి అనుకోని షాక్‌ తగిలింది. మోడల్, నటి సుమన్‌ రంగనాథ్, పూజాగాంధీ తదితరులు నటించిన ‘దండుపాళ్యం–4’ సినిమాను రాష్ట్ర సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇవ్వడానికి అర్హత లేదంటూ తిరస్కరించింది. సినిమాలోని సన్నివేశాలు చాలా హింసాత్మకంగా, అసభ్యంగా ఉన్నందున ప్రజలు ఈ సినిమాను చూడడం సాధ్యంకాదని స్పష్టం చేసింది. దీంతో సెన్సార్‌ బోర్డ్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ చిత్ర నిర్మాత వెంకటేశ్‌ కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి, కేంద్ర సెన్సార్‌ బోర్డ్‌కు ఫిర్యాదు చేయడంతో పరిణామాలు ఉత్కంఠగా మారాయి. కోర్టుకు వెళ్లే విషయంలో నిపుణులతో చర్చిస్తానని నిర్మాత ప్రకటించారు.  

బోర్డుపై నిర్మాత ఆరోపణలు  
నిర్మాత మాట్లాడుతూ గత నవంబర్‌ 7న దండుపాళ్యం–4 సినిమాను చూసి సర్టిఫికెట్‌ మంజూరు చేయాలని చిత్ర బృందం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసింది. జనవరి 2న తమ సినిమాను చూడకుండానే తరువాత వచ్చిన సినిమాలకు సర్టిఫికెట్లను  కేటాయించారు. తాము ఒత్తిడితేవటంతో సినిమాను చూసిన సెన్సార్‌బోర్డ్‌ సభ్యులు ఎలాంటి కారణాలను చూపకుండానే సినిమాను తిరస్కరించినట్లు ఆరోపించారు. అభ్యంతకర సన్నివేశాలు ఏమైనా ఉంటే తొలగించాలని ఆదేశించాలి, లేదా మళ్లీ షూటింగ్‌ చేయాలని సూచించాలి, అలా కాకుండా సెన్సార్‌బోర్డ్‌ తమను వేధిస్తోందని నిర్మాత విమర్శించారు. కోట్లు ఖర్చుచేసి తీసిన సినిమాను సెన్సార్‌బోర్డ్‌ తిరస్కరించడం సరికాదన్నారు. సినిమాను ఐదు బాషల్లో విడుదల చేయాలని నిర్ణయించామని, అంతలోనే ఇలా జరిగిందని అన్నారు. 

ఇవేనా కారణాలు  
దోపిడీ దొంగల కథతో దండుపాళ్యం ఇప్పటివరకు మూడు పార్టులు విడుదలైంది. ఈ మూడు సినిమాలకూ సెన్సార్‌ బోర్డ్‌ పెద్దలకు మాత్రమేనని ‘ఎ’ సర్టిఫికెట్‌ను మంజూరు చేసింది. 4వ సినిమాలో మహిళలను వేధిస్తున్న సన్నివేశాలు భయపెట్టేలా ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా మహిళా పాత్రధారుల వస్త్రధారణ, ఒక ఇంట్లో చొరబడి మహిళను మహిళను లైంగికంగా వేధించటం లాంటి సన్నివేశాలు జుగుప్సాకరంగా ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. సినిమా ప్రారంభం నుండి ఇలాంటి భయంకరణమైన సన్నివేశాలు ఉండటంతో సెన్సార్‌బోర్డ్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నరకటం, చంపటం, వేధించటం తప్ప సమాజానికి అవసరమైన మంచి సందేశమే సినిమాలో లేదనే భావన బోర్డ్‌ సభ్యులకు కలిగినట్లు ఉందని పేరు రాయటానికి ఇష్టపడని సినీ దర్శకుడు ఒకరు అన్నారు. దండుపాళ్యంకు సెన్సార్‌బోర్డ్‌ నిరాకరణ శాండల్‌వుడ్‌లో హాట్‌ టాపిక్‌ అయ్యింది.  

మరిన్ని వార్తలు