క్రికెట్ మ్యాచ్ రోజునా...‘దృశ్యకావ్యం’ కలెక్షన్లు తగ్గలేదు

22 Mar, 2016 00:37 IST|Sakshi
క్రికెట్ మ్యాచ్ రోజునా...‘దృశ్యకావ్యం’ కలెక్షన్లు తగ్గలేదు

‘‘నా కెరీర్‌లో ఇప్పటివరకూ చాలా యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్స్‌లో నవ్వులు పూయించాను. కానీ హారర్ నే పథ్యంలో తెరకెక్కిన  ‘దృశ్యకావ్యం’ చిత్రంలో నటించడం సరికొత్త అనుభూతిని ఇచ్చింది. నాకు మంచి పేరు తీసుకొచ్చిన చిత్రమిది’’ అని హాస్యనటుడు ‘థర్టీ ఇయర్‌‌స’ పృథ్వి అన్నారు. కార్తీక్, కశ్మీర జంటగా స్వీయ దర్శకత్వంలో బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఇందులో డాక్టర్ పృథ్విగా నటించిన  పృథ్వి ఈ సినిమా గురించి చెప్పిన విశేషాలు...

నేను ఇప్పటివరకూ చాలా అనుభవమున్న దర్శకులతో పనిచేశాను. చేస్తున్నాను. కానీ బెల్లం రామకృష్ణారెడ్డి ఈ సినిమా కథ చెప్పడానికి వచ్చినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎవరి దగ్గరా సహాయకునిగా పనిచేయకపోయినా ఆయన క్లారిటీ అద్భుతం. అది నాకు బాగా నచ్చింది. అందుకే ఈ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాను. కొత్త దర్శకులతో అయినా నేను పనిచేయడానికి రెడీ.

షూటింగ్ టైమ్ చాలా హ్యాపీగా గడిచిపోయింది. రామకృష్ణారెడ్డి చాలా చక్కగా ఈ సీన్స్‌ను తీర్చిదిద్దారు. ఈ సినిమా విడుదలయ్యాక మా కష్టానికి తగ్గ రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల వరల్డ్‌కప్ టీ 20లో భాగంగా ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ జరిగిన రోజు కూడా ఈ సినిమాకు కలెక్షన్స్ తగ్గలేదు. ఈ సినిమా బాగా ఆగుతోందని చెప్పడానికి ఇదొక్కటి చాలు.

ఎక్కడా అభ్యంతరకరమైన సన్నివేశాలు లేకుండా ఈ సినిమా అన్ని వర్గాల వారికి నచ్చేలా తీశారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చక్కగా కూర్చొని ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు నచ్చే సినిమా ఇది. వేసవి సెలవుల్లో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు.

సినిమా ద్వితీయార్ధంలో భూతవైద్యుడిగా హీరో ఇంట్లోకి ప్రవేశించిన నాకు హఠాత్తుగా ఎదురయ్యే పిల్లదెయ్యాలు, అవి నన్ను భయపెట్టే సన్నివేశాలకు ముఖ్యంగా పిల్లలు బాగా కనె క్ట్ అవుతున్నారు. ఈ ఎపిసోడ్ మొత్తం ఈ సినిమాకే హైలైట్‌గా నిలిచింది.  

ఇక, ఈ సన్నివేశాలకు గ్రాఫిక్ వర్క్ కూడా బాగా కుదిరాయి.  లైవ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌తో ‘ప్రాణం’ కమలాకర్ అందించిన  నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రాణం పోసింది. సినిమా నిడివి ఎక్కువ కావడంతో నా మీద చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలను తొలగించారు. త్వరలో ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందనున్న ‘దృశ్యకావ్యం-2’లో నటించనున్నా. అందులో కూడా నవ్విస్తాను.

ఆ మధ్య చేసిన ‘లౌక్యం’ తర్వాత నుంచి నాకు వరుసగా మంచి పాత్రలు వస్తున్నాయి. ‘సరైనోడు’,  మారుతి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో చాలా మంచి రోల్స్ చేస్తున్నా.