పారితోషికం తగ్గించుకోవాలి

2 Jun, 2020 03:57 IST|Sakshi

కరోనా కారణంగా షూటింగులు నిలిచిపోవడం, థియేటర్ల మూత వల్ల సినిమా పరిశ్రమ ఇబ్బందుల్లో పడింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పెద్ద స్థాయి హీరోలు, సాంకేతిక నిపుణులు వారి పారితోషికాన్ని తగ్గించుకునే ఆలోచన చేయాలని కోరుతున్నారు ప్రముఖ దర్శకుడు మణిరత్నం. ఇటీవల ఓ వెబి నార్‌లో పాల్గొన్న మణిరత్నం ఈ విషయంపై స్పందిస్తూ –‘‘థియేట్రికల్‌ బిజినెస్‌ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదు. ఇండస్ట్రీ తిరిగి సరైన మార్గంలోకి వచ్చేంత వరకు స్టార్‌ హీరోలు, పెద్ద టెక్నీషియన్లు వారి పారితోషికాలను తగ్గించుకోవాలి. అప్పుడే ఇండస్ట్రీకి మేలు జరుగుతుంది’’ అని అన్నారు.

ఇక తన డైరెక్షన్‌లో వస్తోన్న భారీ బడ్జెట్‌ పీరియాడికల్‌ మూవీ ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ గురించి మణిరత్నం మాట్లాడుతూ – ‘‘పదో శతాబ్దం నేపథ్యంలో ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. ఆ కాలంనాటి సినిమా కాబట్టి పెద్ద సైన్యాలతో కూడిన యుద్ధ సన్నివేశాలు తప్పక ఉండాలి. కానీ కరోనా వల్ల ఆ సన్నివేశాల చిత్రీకరణ కుదిరేలా లేదు. అభివృద్ధి చెందిన టెక్నాలజీ సాయంతో ఆ వార్‌ సీక్వెన్స్‌లు ప్లాన్‌ చేస్తున్నాను’’ అని అన్నారు. విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యారాయ్, త్రిష, శోభితా ధూళిపాళ్ల ముఖ్య తారాగణంగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వార్తలు