నా సినిమా పాక్‌లో విడుదల చేయను

7 Apr, 2017 09:09 IST|Sakshi
నా సినిమా పాక్‌లో విడుదల చేయను

దంగల్ సినిమా చూశారా.. అందులో పతాక సన్నివేశం చాలా కీలకమైనది. ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్ జరిగేటప్పుడు ఆమిర్‌ఖాన్‌ను ఒక కోచ్ గదిలో పెట్టి బంధిస్తాడు. దాంతో తన కూతురు అక్కడ ఎలా పెర్ఫామ్ చేస్తోందోనన్న ఆందోళనతో ఆమిర్ కలవరపడుతుంటాడు. అంతలో బౌట్ ముగిసిన తర్వాత భారత జాతీయగీతం వినిపిస్తుంది. కిటికీ లోంచి బయటకు చూస్తే త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ పైన కనిపిస్తుంది. దాంతో తన కూతురు స్వర్ణపతకం సాధించిందన్న విషయం ఆమిర్‌కు తెలుస్తుంది. ఇది చాలా ఉద్వేగభరితంగా ఉండే సీన్. అయితే ఇందులో భారత జాతీయగీతంతో పాటు త్రివర్ణ పతాకం కనిపిస్తుందన్న కారణంతో ఆ సీన్ కట్‌ చేస్తేనే పాకిస్తాన్‌లో విడుదల చేయనిస్తామని అక్కడి సెన్సార్ బోర్డు పట్టుబట్టింది. అందులో పాకిస్తాన్‌ను కించపరిచేలా ఎలాంటి సన్నివేశం లేదని, పైగా అది సినిమాకు అత్యంత కీలకమైన సన్నివేశం కాబట్టి దాన్ని తొలగించే ప్రసక్తి లేదని సినిమాకు నిర్మాత కూడా అయిన ఆమిర్ స్పష్టం చేశాడు. అంతేకాదు.. అసలు తన సినిమాను పాకిస్తాన్‌లో విడుదల చేసేదే లేదని చెప్పేశాడు.

ఉడీ ఉగ్రదాడుల తర్వాత భారత్ - పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. దాంతో పాకిస్తాన్‌లో భారతీయ సినిమాలను విడుదల కానివ్వలేదు. అలాగే పాక్ నటులు భారతీయ సినిమాల్లో నటిస్తే వాటిని విడుదల కానిచ్చేది లేదని శివసేన, ఎంఎన్ఎస్‌లు పట్టుబట్టాయి. చివరకు కొన్నాళ్ల తర్వాత సమస్య పరిష్కారం కావడంతో ఇక్కడి సినిమాలు అక్కడ విడుదల కావడం మొదలైంది. అలాగే అక్కడి నటీనటులు ఇక్కడ సినిమాల్లో నటిస్తున్నారు. కానీ దంగల్ విషయంలో పాక్ సెన్సార్ బోర్డు ఈ సరికొత్త డిమాండ్ తీసుకురావడంతో ఆమీర్‌కు ఒళ్లు మండింది. సినిమాను అక్కడ విడుదల చేసేందుకు చాలామంది డిస్ట్రిబ్యూటర్లు సిద్ధంగా ఉండి తమను సంప్రదిస్తున్నారని, కానీ ఆమిర్ మాత్రం సెన్సార్ బోర్డు నిర్ణయం తర్వాత అసలు సినిమాను పాక్‌లో విడుదల చేయడానికే ఇష్టపడటం లేదని ఆయన ప్రతినిధి ఒకరు మీడియాకు చెప్పారు. దంగల్ సినిమాకు ఇప్పటికే రూ. 385 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయి. పాక్‌లో విడుదల చేస్తే మహా అయితే మరో 10-12 కోట్లు వస్తాయని, అయినా ఇప్పటికే అక్కడ పైరసీ సీడీలు వచ్చేశాయని.. అందువల్ల ఇక అక్కడ విడుదల చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ ప్రతినిధి తెలిపారు.