'నిజమే సినిమా కలెక్షన్ తగ్గింది'

23 Dec, 2015 11:40 IST|Sakshi
'నిజమే సినిమా కలెక్షన్ తగ్గింది'

కోల్ కతా: దేశంలో మత అసహనం పెరిగిపోతుదంటూ తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పబోనని బాలీవుడ్ టాప్ హీరో షారూఖ్ ఖాన్ స్పష్టం చేశాడు. తన వ్యాఖ్యల ప్రభావం 'దిల్ వాలే' సినిమా కలెక్షన్లపై పడడంతో విచారం వ్యక్తం చేశాడు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, వక్రీకరించారని వాపోయాడు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా కోల్ కతా వచ్చిన షారూఖ్ మీడియాతో మాట్లాడాడు.

'అసహనంపై నేను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలనుకోవడం లేదు. వివరణ మాత్రమే ఇవ్వాలనుకుంటున్నా. నా కళ్లతో చూసిందే నేను మాట్లాడాను. నా గురించి ప్రజలకు తెలుసు. అయితే నేను మాట్లాడినదాన్ని వారు అర్థం చేసుకోలేదు. నా వ్యాఖ్యలను సరిగా ప్రజెంట్ చేయలేదు. నా మాటలతో ఎవరైనా బాధపడివుంటే విచారం వ్యక్తం చేస్తున్నా' అని షారూఖ్ చెప్పాడు.

తాను చేసిన వ్యాఖ్యల ప్రభావం 'దిల్ వాలే' కలెక్షన్లపై పడిందని అతడు అంగీకరించాడు. వివాదాల జోలికి పోకుండా తన సినిమాను అందరూ చూడాలని విజ్ఞప్తి చేశాడు. ప్రాంతం, కులం, మతం, లింగ వివక్ష లేకుండా అందరూ తనను 25 ఏళ్లుగా ఆదరిస్తున్నారని తెలిపాడు. తన సినిమాల ద్వారానే తన ప్రేమను వారికి తిరిగి ఇవ్వగలనని చెప్పాడు. కొంతమంది దుష్ప్రచారం చేసినంతమాత్రానా తన దేశభక్తిని శంకించాల్సిన పనిలేదన్నాడు.