‘ఆ నటుడి వల్ల ప్రాణహాని ఉంది’

10 Feb, 2019 06:59 IST|Sakshi

నటుడు కరుణాకరన్‌ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సినీ దర్శక, నిర్మాతలు నగర పోలీస్‌కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కరుణాకరన్, సంతోష్, సుభిక్ష ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పొదునలన్‌కరుది. ఈ చిత్రం గత 7వ తేదీన విడుదలైంది. ఈ చిత్ర దర్శకుడు సియోన్, సహనిర్మాత విజయ్‌ ఆనంద్‌ శనివారం సాయంత్రం వెప్పేరిలోని పోలీస్‌కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లి నటుడు కరుణాకరన్‌పై ఫిర్యాదు చేశారు. తాము నిర్మించిన పొదునలన్‌కరుత్తు చిత్రంలో కరుణాకరన్‌ను ఒక ప్రధాన పాత్రలో నటింపజేశామని, అందుకు ఆయనకు రూ.22లక్షలు పారితోషికం ఇవ్వనున్నట్లు ఒప్పందం చేసుకున్నామన్నారు.

ఈ చిత్ర షూటింగ్‌ పూర్తై డబ్బింగ్‌ జరుగుతుండగా తన పారితోషికాన్ని పూర్తిగా చెల్లిస్తేనే డబ్బింగ్‌ చెబుతానని కరుణాకరన్‌ అనడంతో మొత్తం చెల్లించామని పేర్కొన్నారు. కాగా చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమానికి పిలిచినా తను రాలేదన్నారు. దీంతో పాత్రికేయుల సమావేశంలో నటుడు కరుణాకరన్‌ పాల్గొనక పోవడం విచారకరం అని దర్శకుడు అన్నారన్నారు. ఇటీవల తాము చిత్ర ప్రీమియర్‌ షో ముగించుకుని కార్యాలయానికి వెళ్లగా అక్కడకు కరుణాకరన్‌ పంపిన కొందరు వ్యక్తులు వచ్చి కరుణాకరన్‌ గురించి తప్పుగా మాట్లాడతారా? అంటూ గొడవకు దిగి తమను కొట్టబోయారని తెలిపారు.

అదే విధంగా గురువారం అర్ధరాత్రి నటుడు కరుణాకరన్‌ ఫోన్‌ చేసి అసభ్య పదజాలంతో తిట్టి బెదిరించారన్నారు. ఇప్పటికే తాము కందువడ్డీ ఇతి వృత్తంతో చిత్రం చేయడంతో కొందరు కందువడ్డీ వ్యాపారులు తమను బెదిరించారని.. ఇప్పుడు కరుణాకరన్‌ బెదిరించడంతో ఆయనకీ వాళ్లతో సంబంధాలు ఉన్నట్టు భావిస్తున్నామని కంప్లయింట్‌లో పేర్కొన్నారు. కరుణాకరన్‌తో ప్రాణ భయం ఉందని, రక్షణ కల్పించాలని ఫిర్యాదులో కోరారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా