సినిమా కలెక్షన్లకు దీపావళి దెబ్బ

31 Oct, 2016 12:57 IST|Sakshi
సినిమా కలెక్షన్లకు దీపావళి దెబ్బ
సాధారణంగా పండుగ సీజన్లో సినిమాలు విడుదల చేస్తే బంపర్ కలెక్షన్లు వస్తాయని హీరోలందరూ తమ సినిమాలను పండుగల కోసం రిజర్వు చేసుకుంటారు. కానీ.. దీపావళి మాత్రం చాలామంది హీరోలకు నిరాశ మిగిల్చింది. ముఖ్యంగా దీపావళికి ముందు వచ్చిన శుక్ర, శనివారాల్లో చాలా బ్రహ్మాండంగా వచ్చిన కలెక్షన్లు కూడా ఆదివారం, పండుగ కలిసి రావడంతో ఒక్కసారిగా తగ్గిపోయాయి. కుర్రాళ్లందరూ టపాసులు కాల్చుకునే సరదాలో ఉండి సినిమాలను పక్కన పెట్టేశారు. పగటి పూట కూడా లక్ష్మీపూజలు జరగడంతో సాధారణంగా ఆదివారం ఖాళీగా ఉండే వ్యాపార వర్గాలు కూడా సినిమాలకు వెళ్లలేదు. దాంతో కలెక్షన్లకు భారీగా గండి పడింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో గట్టి కలెక్షన్లు వస్తాయని అనుకుంటున్న ఏ దిల్ హై ముష్కిల్ సినిమా కూడా ఇదే దారిలో నడిచింది. 
 
విడుదలైన శుక్రవారం 13.30 కోట్లు, శనివారం 13.10 కోట్లు సాధించిన ఈ సినిమా.. ఆదివారం మాత్రం కేవలం 9.20 కోట్ల రూపాయలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. మొదటి వారాంతంలో భారతదేశంలో కలెక్షన్లు 35.60 కోట్ల రూపాయలు వచ్చాయని తెలిపాడు. అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రం ఇది మంచి విజయం సాధించిందని, తొలి వారాంతంలో మొత్తం రూ. 41.05 కోట్ల కలెక్షన్లు సాధించి కరణ్ జోహార్, రణబీర్ కపూర్‌లకు హయ్యస్ట్ ఓపెనింగ్ వీకెండ్‌గా నిలిచిందని వివరించాడు. దీపావళి పూజలు, పండుగ కారణంగానే ఏ దిల్ హై ముష్కిల్, శివాయ్ రెండు సినిమాలకూ ఆదివారం ఏమాత్రం బాగోలేదని.. సోమ, మంగళవారాల్లో బిజినెస్ పుంజుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు.
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా