‘యన్‌.టి.ఆర్‌’లో ఏదో వెలితి..!

10 Jan, 2019 16:33 IST|Sakshi

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన బయోపిక్‌ మూవీ ‘యన్‌.టి.ఆర్ కథానాయకుడు’‌. సినిమా ప్రకటించిన దగ్గర నుంచి ఎన్నో చర్చలకు దారితీసిన యన్‌టిఆర్‌, బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో నందమూరి అభిమానులు పండుగ చేసుకుంటున్నా.. సాధారణ ప్రేక్షకులు మాత్రం ఏదో వెలితి ఉందన్నట్టుగా ఫీల్‌ అవుతున్నారు. సినిమాలో నందమూరి తారక రామారావు బాల్యానికి సంబంధించిన సన్నివేశాలు లేకపోవటం.. తొలిసారి ఎన్టీఆర్‌, ఎల్వీ ప్రసాద్‌లు ఎక్కడ కలిసారు.. ఎల్వీ ప్రసాద్‌ ఎందుకు ఎన్టీఆర్‌కు సినిమా అవకాశం ఇస్తా అన్నారు.. అన్న విషయాలు చూపించకపోవటం లాంటివి కథ అసంపూర్తిగా విన్న భావన కలిగిస్తాయి. ఎన్టీఆర్‌ యువకుడిగా కనిపించే సీన్స్‌లో బాలయ్య లుక్‌పై అభిమానులు కూడా పెదవి విరుస్తున్నారు.

సెకండ్‌ హాఫ్‌లోనూ అలాంటి సన్నివేశాలు చాలా కనిపిస్తాయి. ఎన్టీఆర్‌, చంద్రబాబు నాయుడుల పరిచయం, ఎన్టీఆర్‌ తన కుమార్తెను చంద్రబాబు నాయుడికి ఇచ్చి వివాహం చేయటం లాంటి కీలకమైన సంఘటనలకు కూడా సినిమాలో చోటివ్వలేదు. ఎక్కువగా బాలకృష్ణను వివిధ గెటప్‌లలో చూపించేందుకే సమయం కేటాయించారు. సీతా రామ కళ్యాణం సినిమాలో రావణాసురుడిని దశకంఠుడిగా చూపించేందుకు ఏకంగా 20 గంటల పాటు రెప్ప కూడా వేయకుండా ఎన్టీఆర్ ఒకే స్టిల్‌లో నిలబడ్డట్టుగా చూపించటం అంత నమ్మశక్యంగా అనిపించదు. ఎన్టీఆర్‌ కెరీర్‌లో ఘనవిజయం సాధించిన చిత్రాలను మాత్రమే ప్రస్తావిస్తూ ఫెయిల్యూర్స్‌ను పక్కన పెట్టేయటంతో డ్రామా మిస్‌ అయిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఇక దాన వీర శూర కర్ణ సినిమాలో ఎన్టీఆర్ అనర్గళంగా చెప్పిన ‘ఏమంటివి ఏమంటివి’ డైలాగ్‌ను బాలయ్య చెప్పకుండా కేవలం ఎన్టీఆర్ వాయిస్‌కు యాక్ట్ చేయటం కూడా అభిమానులను నిరాశపరిచే అంశమే.

మరిన్ని వార్తలు