పూరీ జగన్నాథ్‌తో పాటు మరో నలుగురు

19 Jul, 2017 11:09 IST|Sakshi
పూరీ జగన్నాథ్ విచారణ ఇలా...

హైదరాబాద్‌: డ్రగ్స్‌ కేసులో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ బుధవారం ఎక్సైజ్‌ కార్యాలయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఎదుట విచారణకు హాజరయ్యారు. తన కుమారుడు, సోదరుడు, న్యాయవాదులతో కలిసి ఆయన అబ్కారీ కార్యాలయానికి వచ్చారు. ఎక్సైజ్ శాఖ‌లోని సెక‍్షన్‌ 67 ప్రకారం ఆయనను సిట్‌ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. విచారణ గదిలో పూరీ జగన్నాథ్‌తో మరో నలుగురు ఉన్నట్టు తెలుస్తోంది.

ఎక్సైజ్‌ కమిషనర్‌ చంద్రవదన్‌, ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ విచారణను పర్యవేక్షిస్తున్నారు. ప్రధాన నిందితుడు కెల్విన్‌ను అరెస్ట్‌ చేసిన ఇన్స్‌పెక్టర్‌ శ్రీనివాస్‌ కూడా విచారణలో పాల్గొన్నారు. పూరీ జగన్నాథ్‌ సమాధానాలు ఇచ్చే తీరును పరిశీలించేందుకు విచారణ గదిలో మానసిక వైద్యుడు కూడా ఉన్నట్టు సమాచారం. విచార‌ణ నేప‌థ్యంలో ఎక్సైజ్‌ ఆఫీసు దగ‍్గర క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్రత ఏర్పాటు చేశారు.

డ్రగ్స్‌ కేసులో రోజుకొకరి చొప్పున 12 మంది సినిమా ప్రముఖులను సిట్‌ అధికారులు విచారించనున్నారు. ఆగస్టు 2 వరకు విచారణ కొనసాగనుంది. 20న ఛార్మి, 21న ముమైత్‌ ఖాన్, 22న సుబ్బరాజు, 23న శ్యాం కె.నాయుడు, 24న రవితేజ, 25న ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా, 26న నవదీప్, 27న తరుణ్, 28న యువ హీరోలు తనీష్, నందు సిట్‌ ఎదుట హాజరుకావాల్సి ఉంది.