మనిషికో స్నేహం... మనసుకో దాహం ఆత్మబంధువు

22 Nov, 2017 00:57 IST|Sakshi

డబ్బింగ్‌ క్లాసిక్స్‌– 3

తల్లిదండ్రులు ఉంటారు. వేరు. తోబుట్టువులు ఉంటారు. వేరు. జీవితంలో చాలా మంది స్నేహితులు ఉంటారు. వేరు. పెళ్లవుతుంది. భార్య వస్తుంది. పిల్లలు పుడతారు. వేరు. వీరంతా బంధువులు.. బంధాలు కలిగినవారు. వీళ్లలో ఎవరో ఒకరే ఆత్మబంధువులు. సోల్‌మేట్‌. అదృష్టం బాగున్నవారికి కుటుంబంలోనో స్నేహితులలోనో ఆత్మబంధువు దొరుకుతారు. ఇంకా అదృష్టం బాగుంటే భార్యే ఆత్మబంధువు అవుతుంది. కాని ఆ అదృష్టం లేకపోతే?

అసలు ఆత్మబంధువు అంటే ఎవరు? హోరున వాన కురిస్తే తల మీద చేతులు కప్పుకుని నీడన పరిగెడితే అదాటున వచ్చి మన పక్కన ఒక మనిషి నిలబడతాడు. మనం ఊసుపోక విసుగు పుట్టే ఈ బతుకులోని బేజారు పడక ఉల్లాసం కోసం ఒక పల్లవి అందుకుంటే అప్పటి దాకా అలికిడి లేని ఆ ప్రాంతంలో మరొక మనిషి ఊడిపడి చరణం అందుకుంటాడు. మనం పిల్లనగ్రోవి ఊదితే ఒక మనిషి గోవులా కదలి దరికి చేరుతాడు. మనం ఒడ్డున చేపలు పడితే ఒక మనిషి బుట్ట అందుకుని ఆ సంగతి ముందే తెలుసు అన్నట్టు నిలుచుని ఉంటాడు. మనకు నిద్ర వస్తుంటే అతడు రెప్ప మూస్తాడు. మనకు దుఃఖం ఊరితే అతడు బావురుమంటాడు. మనకు అనిపించేది అనిపించడానికి ముందే అతడికి తెలుస్తుంది. మనం చెప్పాలనుకున్నది గొంతు విప్పకముందే అతడికి వినిపిస్తుంది. ఎదురూ బొదురు మౌనంగా ఎంత సేపు కూర్చున్నా మనసులు అనంత సంభాషణలు చేస్తాయి. అనంత సంభాషణల్లో కూడా ఇరువురిలో ఒక ప్రశాంతమైన మౌనం ఉంటుంది. అలాంటి మనిషే ఆత్మబంధువు.

ఇది మగకు మగ అయితే సమస్య లేదు. ఆడకు ఆడ అయితే సమస్య లేదు. ఆడకు మగ, మగకు ఆడ అయితేనే సమస్య. ఈ కథంతా ఆ సమస్య. ఈ సినిమాలో శివాజీ గణేశన్‌ ఒక భావుకుడు. చిన్న పిచ్చిక వడ్ల చేను మీద వాలితే అతడి మనసు పులకరిస్తుంది. చేలో కలుపు తీస్తున్న వనిత గట్టున చెట్టుకు వేళ్లాడగట్టిన ఊయాలలోని పాపాయి కోసం పాట పాడితే అతడి గొంతు పురి విప్పుతుంది. ఆ నింగి అతడికి ఊరట. ఆ ప్రకృతి అతడికి తెప్పరింత. కాని ఇంట్లో భార్య అలా ఉండదు. మురికిగా, గార పళ్లతో, ఎప్పుడూ ఇంత పెద్ద గొంతు వేసుకుని కయ్‌కయ్‌మంటూ... ఆకారం ముఖ్యం కాదు... కాని ప్రవర్తనలో కొంచెం కూడా సౌందర్యం లేదే... సంస్కారం లేదే... శుభ్రంగా చేతులు కడుక్కుని బుగ్గలకు ఆనించుకుని చూసే చిన్నపాటి ముచ్చట కూడా లేదే. ఒక చేత్తో ముక్కు చీదుతూ మరో చేత్తో కంచం పెట్టే ఆ మనిషితో అతడికి ఎప్పుడూ ఏ బంధం లేదు. అతడు ఆ ఇంట్లో ఒక బంధువు వలే ఉన్నాడు. బంధంతో లేడు. కాని పక్కూరి నుంచి పొట్ట చేత్తో పట్టుకుని వలస వచ్చి, ఏటి వొడ్డున గుడిసె వేసుకుని చేపలు పట్టి అమ్ముకుని బతుకుతున్న రాధతో పరిచయం అయిననాటి నుంచి అతడిని ఏదో లాగుతూ ఉంటుంది. మనసులో ఉన్నది ఉన్నట్టు చెబుతూ బూడిదతో తోమిన వంటపాత్రలా ఏ మరకా లేకుండా ఉండే ఆ అమ్మాయి సమక్షం అతడికి హాయిగా ఉంటుంది. ఒకరోజు ఆ అమ్మాయితో కలిసి చేపలు పడతాడు. రెండుసార్లు ఒక్క చేప కూడా పడదు. మూడోసారి దోసెడు చేపలు తుండుగుడ్డలో ఎగిరెగిరి పడతాయి. అది చూసి సంతోషంతో పసిపిల్లాడిలా పెద్దపెద్దగా నవ్వుతాడు. నవ్వి నవ్వి ‘ఈ రోజు నేను చాలా నవ్వాను కదూ’ అని తనకు తానే వేదనగా మననం చేసుకుంటాడు. ఆ అమ్మాయి అంత చింత వేసి నాలుగు పచ్చి మిరపకాయలు వేసి చేపల పులుసు చేస్తే మొదట బెట్టుగా ఆ తర్వాత ఆబగా తిని ‘ఇరవై ఏళ్లయ్యింది ఈ పాటి భోజనం చేసి’ అని కళ్లనీళ్లు పెట్టుకుంటాడు. గాయాలతో నిండిపోయిన అతడి మనసుకు ఆ అమ్మాయి స్నేహం నెమలీకతో రాసిన వెన్న అవుతుంది.

కాని ఊరు ఊరుకోదు. నింద వేస్తుంది. అతడికి పౌరుషం వచ్చి ‘అవును. దానిని ఉంచుకున్నాను’ అంటాడు. ఆ మాట రాధ విని ‘అది నిజం కాదా... నిజంగా నా మీద నీకు ప్రేమ లేదా’ అని అడుగుతుంది. మనసులో ఉన్నది చెప్పడం, అసలు మనసులో ఏదైనా ఆశించడం కూడా మానుకున్న నిస్సహాయ ఉన్నతుడు అతడు. ఏం చెప్తాడు? అలాగని ఆమెతో కులికే వయసా అతనిది? అలాగని ఆమెను కాదనుకునే మనసా అతనిది? ఆమె ఉండాలి. తనకు కనపడుతూ ఉండాలి. తన మీద నాలుగు నవ్వు మాటలు చెప్పి హాయిగా నవ్విస్తూ ఉండాలి. తనున్నానన్న ఒక ఆలంబనను అందిస్తూ ఉండాలి.కాని భార్య, బంధువులు కలిసి ఆ బంధాన్ని తెగ్గొడ్తారు. రాధ కావాలని నేరం చేసి జైలుకు వెళ్లిపోతుంది. అతడి హృదయం ఖాళీ. అతడి గొంతు ఖాళీ. మాటా ఖాళీ. మనిషి శూన్యం. అతడు ఊరిని త్యజిస్తాడు. ఇంటిని త్యజిస్తాడు. ఏ ఏటి ఒడ్డు ఇంట్లో అయితే రాధ ఉండేదో ఆ ఇంట్లో ఆమె కోసం ఎదురు చూస్తూ ఒక్కడే ఉండిపోతాడు. కొనఊపిరితో ఉండగా రాధ జైలు నుంచి విడుదలై వస్తుంది. అంత వరకూ అంగిట్లో ప్రాణం నిలుపుకుని ఉన్న అతడు ఆమెను చూసి మెల్లగా నవ్వుతాడు. చేతిలో చేయి వేస్తాడు. ఏనాడో ఆమె జ్ఞాపకంగా దాచుకున్న పూసల దండ చేతిలో పెట్టి ప్రాణం వదిలేస్తాడు. ఆమెకు మాత్రం తన ఒంట్లోని ఈ ప్రాణం ఎందుకు? ఆమె కూడా మరణిస్తుంది. మనిషి ఏ పాపం అయినా చేయవచ్చు. కాని ఇద్దరు ఆత్మబంధువులను విడదీసే పాపం మాత్రం చేయకూడదు. మనిషికో స్నేహం. మనసుకో దాహం. జీవితంలో ఒక్కసారైనా ఆ దాహం తీర్చే స్నేహాన్ని పొందిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా అంకితం.

ముదల్‌ మరియాదై
1985లో వచ్చిన ‘ముదల్‌ మరియాదై’ ఇక శివాజీ గణేశన్‌ పని అయిపోయినట్టే అనుకున్నవారికి ఊహించని ఎదురుదెబ్బ కొట్టి పెద్ద హిట్‌ అయ్యింది. దర్శకుడు భారతీరాజా తన ఆయువుపట్టయిన పల్లెటూరి నేపథ్యాన్ని అథెంటిక్‌గా తీస్తూ పల్లెల్లో ఎన్నటికీ నెరవేరని స్త్రీ, పురుష మూగ బంధాలను ఎంతో కళాత్మకంగా చూపించడం వల్లే ఈ సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. సినిమా అంతా కర్నాటకలోని ఒక పల్లెటూళ్లో తీశారు. ఇళయరాజా నేపధ్య సంగీతం, ‘పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ల నేనే’ వంటి పాటలు ఇవ్వడం మధురం. జగ్గయ్య గారు శివాజీ గణేశన్‌కు అద్భుతంగా పల్లెటూరి యాసలో డబ్బింగ్‌ చెప్పడం మురిపెం కలిగిస్తుంది. ముఖ కవళికలతో లోతైన భావాలను ఎలా పలికించాలో ఈ సినిమాలో శివాజీని వెయ్యిసార్లు చూసి ఏ కొత్త నటుడైనా ఆవగింజంత సాధించవచ్చు. కాని ఆయన ఎదుట రాధ కూడా నటనలో చిరుతలా తల పడిందని చెప్పవచ్చు. చాలా రోజుల వరకూ యూ ట్యూబ్‌లో దొరకని ఈ సినిమా ఇప్పుడు దొరుకుతోంది.
– కె

మరిన్ని వార్తలు