పవన్ కల్యాణ్ నుంచి చాలా నేర్చుకున్నా!

28 Feb, 2015 22:52 IST|Sakshi
పవన్ కల్యాణ్ నుంచి చాలా నేర్చుకున్నా!

ఒక సినిమాని దర్శకుడు ఎంత బాగా తీసినా, ఎడిటర్ కత్తెరకు పదును ఉంటేనే ఆ సినిమా సక్రమంగా ఉంటుంది. అందుకే చాలా బాధ్యతగా, ఎంతో శ్రద్ధగా ఎడిట్ చేయాల్సి ఉంటుంది. ఏ సినిమా చేసినా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుంటానని ఎడిటర్ ప్రవీణ్ పూడి అంటున్నారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రవీణ్ పూడి మాట్లాడుతూ - ‘‘సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావుగారి దగ్గర శిష్యరికం చేశాక,  ‘పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’లో చేరాను. పవన్ కల్యాణ్‌గారు నటించిన జానీ, బాలు, గుడుంబా శంకర్, అన్నవరం చిత్రాలకు అసోసియేట్ ఎడిటర్‌గా పని చేశాను.
 
 ఆ సమయంలో ఆయన్నుంచి చాలా నేర్చుకున్నాను. ‘జల్సా’కి అసోసియేట్ ఎడిటర్‌గా చేసిన నన్ను, త్రివిక్రమ్‌గారు ‘జులాయి’తో ఎడిటర్‌గా పరిచయం చేశారు. అప్పట్నుంచీ ఇప్పటివరకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా పోయింది. జులాయి, గుండె జారి గల్లంతయ్యిందే, అత్తారింటికి దారేది, మనం తదితర చిత్రాలు ఎడిటర్‌గా నా కెరీర్‌కి బెస్ట్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం నాగార్జునగారి ‘సోగ్గాడే చిన్ని నాయనా’, అల్లు అర్జున్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’, నితిన్ ‘కొరియర్ బోయ్ కల్యాణ్’ చిత్రాలకు పని చేస్తున్నా’’ అని తెలిపారు.