జగనే రావాలి.. జగనే కావాలి

11 Nov, 2023 04:34 IST|Sakshi

ఇంటింటా.. ప్రతి నోటా అదే నినాదం

‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమానికి విశేష స్పందన

సాక్షి, అమరావతి: ఏ ఇంటి తలుపుతట్టినా ఏ ఒక్కరిని కదిపినా ఒకే మాట.. ఒకే నినాదం.. అదే ‘జగనే రావాలి.. జగనే కావాలి’. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నినాదం ప్రతిధ్వనిస్తోంది. వై ఏపీ నీడ్స్‌ జగన్‌ (ఆంధ్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలంటే) కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. నాలుగు­న్నరేళ్లుగా చేసిన మంచిని వివరించడంతో­పాటు గతంలో అధికారంలో ఉండగా చంద్ర­బాబు–పవన్‌ కళ్యాణ్‌ జోడీ చేసిన మోసాలను గుర్తు చేయడం, ఇప్పుడు మళ్లీ అదే జోడీ సుపరిపాలనను అడ్డుకోవడానికి వస్తున్నారనే విషయాన్ని చెప్పడమే లక్ష్యంగా చేపట్టిన ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమం గురువారం 26 జిల్లాల్లో 660 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో భారీ జనసందోహం మధ్య ఘనంగా ప్రారంభమైంది.

శుక్రవారం ఉదయం ఆ 660 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుల నేతృత్వంలో ప్రజాప్రతినిధులు, వలంటీర్లు, గృహ­సారథులు ఇంటింటా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నాలుగున్నరేళ్లలో సీఎం వైఎస్‌ జగన్‌ సంక్షేమ పథకాల ద్వారా చేసిన మంచిని.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలపడాన్ని వివరిస్తూ 24 పేజీలతో రూపొందించిన పుస్తకాన్ని ప్రతి ఇంటికీ అందించారు.

2014 ఎన్నికల్లో చంద్రబాబు–పవన్‌లు ఇచ్చిన హామీలను.. 2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీల అమలు తీరుతో పోల్చుతూ నేతలు వివరిస్తున్నప్పుడు.. మోసం చేసిన చంద్రబాబు, పవన్‌ల మాటలను నమ్మం అంటూ ప్రతి ఇంటి అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలు ప్రతిస్పందించారు. మంచి చేసిన జగన్‌ వెంటే నడుస్తామంటూ ప్రజాతీర్పు పుస్తకంలో తమ అభిప్రాయాన్ని నమోదు చేయించి.. ‘ఆపు బాబు నాటకం.. జగనే మా నమ్మకం’ అంటూ నినదించారు.

660 సచివాలయాల పరిధిలో ప్రతి ఇంటి తలుపుతట్టే వరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇక శుక్రవారం మరో 721 సచివాలయాల పరిధిలో ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సచివాలయాల పరిధిలో ఇంటింటా ప్రచారం శనివారం నుంచి చేపట్టనున్నారు.  

మరిన్ని వార్తలు