సినిమా నిర్మించానని తిట్టారు

14 Oct, 2019 06:13 IST|Sakshi

‘‘ఎవరికీ చెప్పొద్దు’ సినిమా కంటే ముందు సుమారు 47 కథలు విన్నాను. దర్శకులు కథలతో నా దగ్గరకు రారని తెలుసు. అందుకే నేనే వాళ్ల వెనకపడేవాణ్ణి.. ఫోన్లు చేసేవాణ్ణి. స్క్రిప్ట్స్‌ ఉంటే చెప్పండి అని అడిగేవాణ్ణి’’ అన్నారు రాకేశ్‌  వర్రె. ‘జోష్, వేదం, బద్రీనాథ్, బాహుబలి, గూఢచారి’ సినిమాల్లో సహాయ నటుడిగా నటించారు రాకేశ్‌. ప్రస్తుతం ‘ఎవరికీ చెప్పొద్దు’ సినిమాలో హీరోగా నటించి, నిర్మించారాయన. గార్గెయి ఎల్లాప్రగడ కథానాయిక. బసవ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఈ నెల 8న నిర్మాత ‘దిల్‌’ రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా రాకేశ్‌ మాట్లాడుతూ–‘‘బాహుబలి’ సినిమా చేశాక ‘న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీ’కి వెళ్లి, తిరిగొచ్చిన తర్వాత కథల కోసం ఎదురు చూశా.

అప్పుడే బసవ శంకర్‌ పరిచయం అవడంతో ఈ సినిమా మొద లైంది.  ‘ఎవరికీ చెప్పొద్దు’ కథను మొదట ‘దిల్‌’ రాజుగారి దగ్గరకి తీసుకెళ్లాను. ఆయనకు వినడం కుదర్లేదు. ‘నువ్వు ఏమైనా చెయ్‌ కానీ ప్రొడ్యూస్‌ చేయొద్దు’ అని నాతో చెప్పారాయన. చాలా మంది నిర్మాతలను కలిశాం.. కుదర్లేదు. బహుశా కులం అనే సున్నితమైన టాపిక్‌ ఉందని ఎవరూ ముందుకురాలేదేమో? దాంతో నేనే నిర్మించాను. సినిమా అయ్యాక రాజుగారి దగ్గరకు తీసుకెళ్తే ప్రొడ్యూస్‌ చేసినందుకు తిట్టారు. ఆయనే మా సినిమాను రిలీజ్‌ చేశారు. నేను హీరో కావడానికి చిరంజీవిగారు స్ఫూర్తి. ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ 50–60సార్లు చూశా. భవిష్యత్తులో విలన్‌ రోల్స్‌ వచ్చినా చేస్తాను’’ అన్నారు.

మరిన్ని వార్తలు