150వ సినిమాపై ఆతృతగానే ఉంది

27 Aug, 2014 02:31 IST|Sakshi
150వ సినిమాపై ఆతృతగానే ఉంది

చిరంజీవి పర్సనల్ మేకప్‌మన్ శివ
సినిమాతెరపై మెగాస్టార్‌ను అందంగా చూపించడానికి, విభిన్నంగా ప్రెజెంట్ చేయడానికి ఉపయోగపడిన హస్తవాసి ఆయనదే. చిరంజీవి నటించిన మొదటి చిత్రం నుంచి ఇప్పటివరకూ విడుదలైన 149వ చిత్రం వరకూ కూడా మేకప్ ఆయనదే. ఆయనే మేకప్‌మన్ మేకా శివ. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన శివ 1979లో నిర్మించిన చిరంజీవి తొలి చిత్రం పునాదిరాళ్లు నుంచి శంకర్‌దాదా జిందాబాద్ వరకు కూడా చిరంజీవి వ్యక్తిగత మేకప్‌మన్‌గా ఉన్నారు. అమలాపురంలో లియో ప్రొడక్షన్స్ బేనర్‌పై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘ముకుంద’ చిత్రానికి శివ చీఫ్ మేకప్‌మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన శివను మంగళవారం ‘సాక్షి’ పలకరించింది. చిరంజీవితో తన అనుబంధం, పర్సనల్ మేకప్‌మన్‌గా ఆయనతో తన ప్రస్థానాన్ని శివ వివరించారు. ఆ సంగతులు ఆయన మాటల్లోనే...
 
  అమలాపురం టౌన్ : మాది పిఠాపురం. మా మేనమామ కోటేశ్వరరావు 1970లోనే సినీ పరిశ్రమలో ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్. ఆయనే నన్ను మద్రాస్ తీసుకువెళ్లి ప్రముఖ మేకప్‌మన్ సాంబయ్య వద్ద అసిస్టెంట్‌గా చేర్చారు. దర్శక నిర్మాత క్రాంతికుమార్ సినిమాలకు అప్పట్లో ఎక్కువగా పనిచేశాను. 1978లో చిరంజీవి తొలి చిత్రం పునాదిరాళ్లు సినిమాకు నిర్మాణ సంస్థ తరపున మేకప్‌మన్‌గా పనిచేశాను. తన రెండో సినిమాకు చిరంజీవి నన్ను పిలిచి మేకప్‌మన్‌గా ఉండమన్నారు. అలా ఆనాడు మొదలైన మా అనుబంధం 36ఏళ్లుగా కొనసాగుతూనే వచ్చింది.
 
 చిరంజీవిని ప్రతి చిత్రంలో కొత్తగా చూపించాలనే తపనతో మేకప్ చేసేవాడిని. అందుకోసం గంటల తరబడి ముందే ప్లాన్ చేసుకునేవాడిని. ఇంద్ర సినిమాకు ఆ పాత్రకు తగ్గట్టుగా చిరంజీవి ముఖం రౌద్రంగా కనిపించేలా మీసాల నుంచి ఆహార్యం వరకు మేకప్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాను. మంజునాథ చిత్రంలో శివుడి గెటప్, చంటబ్బాయి చిత్రంలో దాదాపు ఆరు స్పెషల్ గెటప్స్‌కు, ముఖ్యంగా చార్లీ చాప్లిన్ పాత్రకు ప్రత్యేకశ్రద్ధతో మేకప్ చేశాను.
 
 చిరంజీవికి వ్యక్తిగత మేకప్‌మన్‌గానే కాకుండా ఆయన కుటుంబంతో కూడా నాకు ఎంతో బలమైన అనుబంధం పెనవేసుకుంది. వారి కుటుంబంలో నన్నూ ఒక సభ్యుడిగా చూస్తారు.  రామ్‌చరణ్‌తేజను చిన్నప్పుడు ఎత్తుకుని ఆడించేవాడిని. అతడితోనే కాదు మిగిలిన పిల్లలందరితోనూ మంచి అనుబంధం ఉంది.  చిరంజీవి పెళ్లి తో పాటు ఆయన కుటుంబంలో జరిగిన ప్రతి వేడుకలో నేనూ ఉన్నాను.
 
చిరంజీవితో కలిసి నాగేంద్రబాబు నటించిన రాక్షసుడు, లంకేశ్వరుడు, మరణమృదంగం, కొండవీటి దొంగ, మృగరాజు చిత్రాల్లో చిరంజీవితోపాటు నాగేంద్రబాబుకూ నేనే మేకప్ చేశాను.  చిరంజీవి నటించే 150వ చిత్రం కోసం మొత్తం సినీ పరిశ్రమ ఆతృతగా ఎదురు చూస్తోంది. అందరితోపాటు నేనూ ఆత్రంగా ఎదురుచూస్తున్నాను. ఆ చిత్రానికి మేకప్‌మన్ నేనే అయినప్పటికీ ఆ పాత్ర స్వభావం ఎలాంటిది.. ఎలాంటి మేకప్ చేయాలి.. చిరంజీవిని ఇంకా కొత్తగా ఎలా చూపించాలి అనే విషయంలో నాకూ ఉత్కంఠగానే ఉంది.