కేణిలో ఆ ఇద్దరి పాట!

20 Jan, 2018 10:51 IST|Sakshi

సాక్షి, చెన్నై: గానగంధర్వులు కేజే.ఏసుదాస్, ఎస్‌పీ.బాలసుబ్రహ్మణ్యం కలిసి పాడితే అది నిజంగా విశేషమే అవుతుంది. అలా 25 ఏళ్ల ముందు ఈ గాన తపస్విలు కలిసి ఆలపించారు. ఆ తరువాత సంగీత కచేరిలో ఒకే వేదికపై పాడి ఉండవచ్చుగానీ, సినిమా కోసం కలిసి పాడిన సందర్భం లేదు. అలాంటి అరుదైన సంఘటన కేణి చిత్రం కోసం జరిగింది. తమిళం, మలయాళం భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఒకే పాటను కేజే.ఏసుదాస్, ఎస్‌పీ.బాలు కలిసి పాడారు. మలయాళ దర్శకుడు నిషాద్‌ తొలిసారిగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్న ఇందులో సీనియర్‌ నటి జయప్రద, సుహాసిని, రేవతి, నటుడు పార్థిబన్, నాజర్, నటి అనుహాసన్, రేఖ ప్రధాన పాత్రలు పోషించారు. 

ఫ్రగ్రాంట్‌ నేచర్‌ ఫిలిం క్రియేషన్స్‌ పతాకంపై ఆన్‌ సజీవ్, సజీవ్‌ నిర్మిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం స్థానిక వడపళనిలోని ఒక నక్షత్రహోటల్‌లో జరిగింది. నటి సుహాసిని చిత్ర ఆడియోను ఆవిష్కరించగా నటి జయప్రద, పార్థిబన్‌ తొలి ప్రతిని అందుకున్నారు. జయప్రద మాట్లాడుతూ.. తమిళంలో వరసగా నటించడం సంతోషంగా ఉందన్నారు. ఇంతకు ముందు నినైత్తాలే ఇనిక్కుమ్, సలంగై ఒళి, ఏళైజాతి, దశావతారం వంటి చిత్రాల వరుసలో ఇప్పుడు కేణి వంటి మంచి చిత్రాల్లో నటించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. 

ఈ చిత్రంలో తాను ఇందిర అనే సామాజిక బాధ్యత కలిగిని పాత్రలో నటించానని చెప్పారు. మహిళలు అభివృద్ధి చెందాలని అందరం చెబుతుంటామన్నారు. అయితే అలాంటి సమాజాన్ని స్త్రీలే సాధించుకోవాలని చెప్పే చిత్రంగా కేణి చిత్రం ఉంటుందని తెలిపారు. అదే విధంగా మంచి నీళ్లు అన్నవి తమిళనాడు, కేరళ, కర్ణాటకలకు సంబంధించిన విషయం కాదన్నారు. నీరు అన్నది ప్రపంచ సమస్య అని, అలాంటి సమస్యను కథలో చేర్చిన దర్శకుడిని అభినందిస్తున్నానన్నారు. తాను ఇతర భాషా చిత్రాల్లో నటిస్తున్నా, తమిళంలోనూ నటించాలని కోరుకుంటున్నానని ఆమె అన్నారు.  

దర్శకుడు నిషాద్‌ మాట్లాడుతూ.. మలయాళంలో కిణరు తనకు ఏడవ చిత్రం అయినా, తమిళంలో కేణి తొలి చిత్రం అని తెలిపారు. తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రం సామాజిక ఇతివృత్తంతో కూడి ఉంటుందన్నారు. నీళ్లు ఈ భూమిపై జీవించే ప్రాణులందరికి చెందుతాయన్నారు. అలాంటిది మానవులు మాత్రమే సొంతం చేసుకోవాలనుకుంటున్నారని అన్నారు. ఎండ, వాన లాంటివి ప్రకృతి ప్రసాదించినవని కరువుకు మాత్రం మనిషే కారణం అవుతున్నాడని అన్నారు. ఈ విషయాలను ఆవిష్కరించే చిత్రంగా కేణి ఉంటుందని దర్శకుడు తెలిపారు. 
 

మరిన్ని వార్తలు