Adipurush: ఆదిపురుష్‌కు పని చేయడమే నేను చేసిన పెద్ద తప్పు.. దేశం వదిలి వెళ్లిపోయా..

10 Nov, 2023 11:40 IST|Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ కెరీర్‌లో అతిపెద్ద డిజాస్టర్‌ చిత్రాల్లో ఆదిపురుష్‌ ఒకటి. ఈ సినిమాకు వచ్చినన్ని విమర్శలు ప్రభాస్‌ నటించిన మరే చిత్రానికీ రాలేదు. ఆ రేంజ్‌లో ఈ మూవీపై ట్రోలింగ్‌ జరిగింది. సినిమాలో నటీనటుల గెటప్స్‌, డైలాగ్స్‌ దగ్గరినుంచి విజువల్‌ ఎఫెక్ట్స్‌ వరకు అన్నింటి మీదా విమర్శలు వచ్చాయి. ఈ సినిమాకు సంభాషణల రచయితగా పని చేసిన మనోజ్‌ ముంతషీర్‌ మీదైతే లెక్కలేనంత ట్రోల్‌ జరిగింది. ఆయన రాసిన ఓ డైలాగ్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం కావడంతో దాన్ని మార్చేసి ప్రేక్షకులకు సారీ కూడా చెప్పాడు.

వాళ్లకు నేను ఎప్పటికీ హీరోనే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆదిపురుష్‌ వల్ల ఎదురైన ఇబ్బందులు పేర్కొన్నాడు. 'ఈ ప్రపంచం ఓ రోజు మనల్ని మంచివాడిగా చూస్తుంది. మరో రోజు చెడ్డవాడిగా చూస్తుంది. కానీ మన కుటుంబానికి మాత్రం మనం ఎప్పటికీ హీరోనే! నేనొక తప్పు చేశాను.. ఆదిపురుష్‌ సినిమాకు రచయితగా పనిచేసి చాలా పెద్ద తప్పు చేశాను. కానీ దాని నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఇక నుంచి ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తాను.

సెకండ్‌ ఛాన్స్‌ కావాలి
ఆ సినిమా రిలీజయ్యాక వచ్చిన విమర్శలపై స్పందించకుండా ఉంటే బాగుండేది. అప్పటికే జనాలు నామీద కోసంతో ఊగిపోతున్నారు. అలాంటప్పుడు సంయమనంతో సైలెంట్‌గా ఉంటే అయిపోయేది. కానీ నన్ను ఇంకా ‍ద్వేషించారు. చంపుతామని బెదిరించారు. అప్పుడు నేను విదేశాలకు వెళ్లిపోయి ఆ వివాదం సద్దుమణిగేంతవరకు అక్కడే ఉన్నాను. ఇక ఇండస్ట్రీలో ఎన్నో హిట్‌ సినిమాలకు పని చేసిన నాకు సెకండ్‌ ఛాన్స్‌ కావాలి. బాహుబలి హిందీ డబ్బింగ్‌తో పాటు తేరి మిట్టీ, దేశ్‌ మేరే వంటి ఎన్నో చిత్రాలకు రచయితగా పని చేశాను. అసలు నా పాటలు మోగకుండా రామనవమి, దీపావళి, దసరా పండగలే జరగవని నేను సగర్వంగా చెప్పగలను' అని చెప్పుకొచ్చాడు మనోజ్‌ ముంతషీర్‌.

చదవండి: తినడానికి తిండి లేని రోజులు.. కన్నీళ్లు పెట్టుకున్న శోభ తల్లి

మరిన్ని వార్తలు