మోహన్బాబు, బ్రహ్మానందంలకు హైకోర్టు నోటీసులు

23 Dec, 2013 16:11 IST|Sakshi
మోహన్బాబు, బ్రహ్మానందంలకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్: సినిమా టైటిల్స్లో 'పద్మశ్రీ'ని దుర్వినియోగం చేశారని ప్రముఖ హీరో, నిర్మాత మోహన్బాబు, ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంలపై  హైకోర్టు నోటీసులు జారీ చేసింది.  పద్మశ్రీని వారు వెనక్కు ఇస్తే గౌరవంగా ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సినిమా టైటిల్స్లో  నటులకు పద్మశ్రీ ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.  పద్మశ్రీని వెనక్కు తీసుకునేలా ఆదేశించాలని  బిజెపి నేత ఇంద్రసేనారెడ్డి కోర్టును కోరారు.  'దేనికైనారెడీ' సినిమా క్లిప్పింగ్‌ను పిటిషనర్ ఉదహరించారు.

పేరుకు ముందు, వెనక పద్మశ్రీ ఉండటంపై ఇంద్రసేనారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.  సుప్రీం కోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా వారు సినిమా టైటిల్స్లో పద్మశ్రీని వాడుకున్నారని ఆయన తెలిపారు. పిటిషనర్ వాదనతో హైకోర్టు ఏకీభవించింది.  మోహన్ బాబు, బ్రహ్మానందంలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది

2007లో మోహన్ బాబును, 2009లో  బ్రహ్మానందంను కేంద్ర ప్రభుత్వం  పద్మశ్రీ అవార్డులతో గౌరవించింది.  మోహన్ బాబు, బ్రహ్మానందంలు వారం రోజులలో 'పద్మశ్రీ'లను తిరిగి ఇస్తే బాగుంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించారని హైకోర్టు తెలిపింది.   ఈ కేసు విచారణను కోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది.


 'దేనికైనారెడీ' సినిమా వివాదంలో సెన్సార్ బోర్టు తీరును హైకోర్టు తప్పు పట్టింది.