ఆయన్ని అక్కడలా చూసి షాకయ్యాను!

18 Dec, 2013 01:40 IST|Sakshi
ఆయన్ని అక్కడలా చూసి షాకయ్యాను!

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ భాగ్యనగరంలో హల్‌చల్ చేశారు. ఆయన నటించిన ‘ధూమ్-3’ చిత్రం ఈ నెల 20న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ నిమిత్తం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో విలేకరులతో ఆమిర్ ముచ్చటించారు. ఆయనతో పాటు అభిషేక్ బచ్చన్, కత్రినా కైఫ్, ఉదయ్‌చోప్రా, ‘ధూమ్ 3’ దర్శకుడు విజయ్‌కృష్ణ ఆచార్య ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి, తన ప్రణాళికల గురించి ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు చెప్పారు ఆమిర్.
 
 నా కెరీర్‌లోనే కష్టమైన పాత్ర: 30 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో ప్రయోగాత్మక పాత్రలు పోషించినా... ‘ధూమ్-3’లో పోషించిన సహీర్ పాత్ర మాత్రం నిజంగా నా కెరీర్‌లో ప్రత్యేకం. స్క్రిప్ట్ విన్నప్పుడే థ్రిల్ ఫీలయ్యాను. ఈ సినిమాను వదులుకోకూడదు అనిపించింది. ఎందుకంటే ఇలాంటి యాక్షన్ అడ్వంచరస్ మూవీ నేను ఇప్పటివరకూ చేయలేదు. శారీరకంగా ఈ సినిమాకు పడ్డ కష్టం నేను ఏ సినిమాకూ పడలేదు. ఇందులో నేను సర్కస్ మాస్టర్‌ని. ప్రమాదకరమైన సర్కస్ విన్యాసాలను శిక్షకుల సహాయంతో నేర్చుకున్నాను. ట్యాప్ నృత్యంతో పాటు, యాక్షన్ ఎపిసోడ్స్ విషయంలో కూడా చాలా శ్రమించాను.

 ప్రయోగాలంటే నాకిష్టం: నటునిగా ఇన్నాళ్ల అనుభవంలో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే... తేలిగ్గా పోషించే పాత్ర అంటూ ఏదీ ఉండదు. ప్రతి పాత్ర తనదైన సంక్లిష్టతలను కలిగి ఉంటుంది. కాకపోతే దాన్ని అర్థం చేసుకునే విధానంలోనే తేడా. నా వరకూ నేను ప్రయోగాలను ఇష్టపడతాను. ఛాలెంజ్‌గా తీసుకొని చేసే పాత్రల వల్లే నటునికి సంతృప్తి అనేది లభిస్తుంది. అంతేకాదు... నా సినిమాలు 200 కోట్లు, 500 కోట్లు వసూలు చేయాలని నేను కోరుకోను. నా సినిమాను ప్రేక్షకులు ప్రేమించాలని మాత్రమే కోరుకుంటాను. నా సినిమాల్లో ఏదో ఒక అంశం వారిని ఆకర్షించాలి.
 నా ఫిట్‌నెస్ రహస్యం అదే: నా తల్లిదండ్రులు ప్రసాదించిన జీన్స్, భగవంతుని దయ... ఈ రెండు కారణాలవల్లే యాభైకి దగ్గరపడుతున్నా... ఇంకా యంగ్‌గా కనిపించగలుగుతున్నా. ఫస్ట్ నుంచి ఆరోగ్యం విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టేవాణ్ణి కాదు. అయితే గత అయిదేళ్ల నుంచి కాస్త కేర్ ఎక్కువ తీసుకుంటున్నా. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నా. అంతేకాక రోజుకు కనీసం ఆరు లీటర్ల నీళ్లు తాగుతున్నా.
 ఆయనే నాకు ఆదర్శం: ‘ఖయామత్‌సే ఖయామత్ తక్’ షూటింగ్ జరుగుతున్న రోజులవి. మా సెట్ పక్కనే ఉన్న ఓ రూమ్‌లో ఎవరో ఆర్టిస్టు తమ పాత్రను రిహార్సల్స్ చేసుకుంటున్నారు. చెప్పిన డైలాగునే... మళ్లీ మళ్లీ చెబుతూ గంటల తరబడి రిహార్సల్స్ చేస్తున్నారు. ఒకే డైలాగుని ముప్పై, నలభై సార్లు చెబుతున్నారు ఎవరా... అని డోర్ తెరిచి చూశాను. నాకు గుండె ఆగినంత పనైంది. ఆ గదిలో ఉన్నది సాధారణమైన వ్యక్తి కాదు. ది గ్రేట్ బిగ్‌బీ అమితాబ్. అప్పటికే... ఆయన తిరుగులేని సూపర్‌స్టార్. కానీ... తన పాత్ర కోసం ఆయన పడుతున్న తపన చూసి షాక్‌కి గురయ్యాను. వృత్తి పట్ల అంకితభావం అంటే ఏంటో ఆ సంఘటన ద్వారా నాకు అర్థమైంది. అమితాబ్‌నే స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళుతున్నాను. ఇన్నాళ్ల కెరీర్లో ఆయనతో కలిసి ఒక్కసారి కూడా నటించలేదు. అవకాశం వస్తే మాత్రం వదులుకోను.
 ‘సత్యమేవ జయతే’ రెండో సెషన్: సామాజిక సమస్యలను స్పృశిస్తూ నా ఆధ్వర్యంలో జరిగిన  ‘సత్యమేవ జయతే’ రియాలిటీ షోకు మంచి స్పందన లభించింది. ఎందరో వ్యధార్థుల జీవితాలను దగ్గరగా చూసే అవకాశం ఆ కార్యక్రమం నాకిచ్చింది. త్వరలో ‘సత్యమేవ జయతే’ రెండో సెషన్‌ని ప్రారంభించబోతున్నాను. సమాజాన్ని నిర్వీర్యం చేస్తున్న మద్యపానంపై ప్రజలకు అవగాహన తెచ్చేలా ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దుతున్నాం.