ఏడు పదుల వయసు...డెభై ఒక్క వేల చెట్లు!

1 Jun, 2014 22:54 IST|Sakshi
ఏడు పదుల వయసు...డెభై ఒక్క వేల చెట్లు!

‘‘మన మనసు రాయిలాంటిది. మంచి పాట విన్నప్పుడు అది ఇట్టే కరిగిపోతుంది. అందుకే సంగీతానికి రాళ్లు కరుగుతాయంటారు’’ అని ఓ సందర్భంలో స్వరజ్ఞాని ఇళయరాజా అన్నారు. నిజమే... ఆయన పాటలకు మనసు కరగకుండా ఉంటుందా.. చెవులు కోసుకోనివాళ్లుంటారా? ఈ మ్యూజిక్ మేస్ట్రో దాదాపు నాలుగు దశాబ్దాలుగా నిత్య సంగీత సాధకునిగా కొనసాగుతున్నారు. ముప్ఫయ్, నలభైఏళ్ల క్రితం ఆయన పాట ఎంత తాజాగా ఉండేదో ఇప్పుడూ అలానే ఉంటుంది. అందుకే, ఇళయరాజా భారతదేశం గర్వించదగ్గ సంగీతదర్శకుడంటే అతిశయోక్తి కాదు. ఈ మేస్ట్రో నేటితో 71వ ఏట అడుగుపెడుతున్నారు. స్వతహాగా నిరాండబరంగా ఉండే ఇళయరాజా పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటారు.  
 
 ఓ సందర్భంలో తన జీవన శైలి గురించి ఇళయరాజా చెబుతూ.. ‘‘నేనెప్పుడూ నా గురించి చాలా తక్కువగా అనుకుంటాను. ఈ లోకంలోకి వచ్చేశాం... ఏదో సాధించేశాం అనే ఫీలింగ్ లేదు. పాటే నా ప్రపంచం. ఆడంబరాలు నాకు పడవు’’ అన్నారు. ఇళయరాజా పుట్టినరోజు జరుపుకోకపోయినా, ఆయన అభిమానులు మాత్రం వేడుకలు చేస్తుంటారు. పైగా, ఈసారి ఇళయరాజా అభిమానుల సంఘం కూడా ఉంది. ఈసారి ఏంటీ? ఇంతకుముందు అభిమాన సంఘం లేదా? అనే సందేహం రావచ్చు. నిజంగానే లేదు. ఎందుకంటే, గతంలో ఎంతోమంది అభిమానులు అభిమాన సంఘం ఆరంభిస్తామని ముందుకొచ్చినా ఇళయరాజా అంగీకరించలేదు. ఇటీవలే పచ్చజెండా ఊపారు.
 
 దాంతో అధికారికంగా అభిమాన సంఘం ఆరంభమై దాదాపు మూడు నెలలవుతోంది. స్వలాభం కోసం కాకుండా అభిమానులు సేవా కార్యక్రమాలు చేయడం కోసమే ఈ సంఘానికి అనుమతించారు ఇళయరాజా. ఈ క్రమంలో ఇళయరాజా 71వ పుట్టినరోజుని పురస్కరించుకుని తమిళనాడులోని వివిధ నగరాల్లో గల అభిమాన సంఘాలకు చెందినవారు 71 వేల చెట్లు నాటాలని నిర్ణయించుకున్నారు. పర్యావరణాన్ని కాపాడే దిశలో అభిమానులు ఈ మహత్కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  చెట్లు నాటడంతో పాటు వాటి సంరక్షణా బాధ్యతలను కూడా అభిమానులే స్వీకరించనున్నారు. దాదాపు కోటి మంది సభ్యులున్న ఈ అభిమాన సంఘం భవిష్యత్తులో మరిన్ని మంచి పనులు చేయాలనుకుంటోంది. తన పాటతో ఇళయరాజా అందర్నీ ఆహ్లాదానికి గురి చేస్తుంటే... ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ఆయన అభిమానులు ఇలా చెట్లు నాటాలనుకున్నారు. ఇదంతా మా రాజాగారి స్ఫూర్తితోనే అంటున్నారు అభిమానులు.