ఆస్కార్‌కి ‘విసారణై’

23 Sep, 2016 00:36 IST|Sakshi
ఆస్కార్‌కి ‘విసారణై’

ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డుల నామినేషన్ ఎంట్రీకి ఈ ఏడాది మనదేశం నుంచి అధికారికంగా తమిళ చిత్రం ‘విసారణై’ను పంపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో శ్రామికులుగా పనిచేసిన తమిళుల జీవితాల ఆధారంగా ఒక ఆటోరిక్షా డ్రైవర్ రాసిన నవల ఈ చిత్రానికి ఆధారం. నిజజీవితాలకు అద్దం పట్టే ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను వెట్రిమారన్ దర్శకత్వంలో హీరో ధనుష్ నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం మూడు జాతీయ అవార్డులు, వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అంతర్జాతీయ అవార్డు అందుకుంది. నిజానికి, రానున్న ఆస్కార్స్‌లో ‘ఉత్తమ విదేశీ భాషా చిత్రం’ విభాగంలో భారత సినీసీమ నుంచి అధికారిక ఎంట్రీగా వెళ్ళేం దుకు మన ‘రుద్రమదేవి’ సహా వివిధ ప్రాంతీయ భాషల నుంచి మొత్తం 29 ఫిల్మ్‌లు పోటీ పడ్డాయి. చివరకు ‘విసారణై’ను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్.ఎఫ్.ఐ) సారథ్యంలోని జ్యూరీ ఎంపిక చేసింది.
 
  ‘ఆస్కార్ అవార్డ్స్ ఎంట్రీ సెలక్షన్ కమిటీ’ చైర్మన్, ప్రముఖ దర్శకుడు కేతన్ మెహతా గురువారం హైదరాబాద్‌లో ఈ సంగతి ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- ‘‘ఇండియాలో ఏటా దాదాపు వెయ్యి సినిమాలు నిర్మిస్తున్నారు. ఆస్కార్ ఎంట్రీ పరిశీలనకు కొన్ని చిత్రాలనే ఎంపిక చేయడం కష్టం. ఈసారి పరిశీలించిన 29 చిత్రాలూ ఇన్‌స్పైర్ చేశాయి. ఎంచుకున్న కథాంశం, దాన్ని తెరపై ప్రెజెంట్ చేసిన విధానం, సాంకేతిక అంశాలను పరిశీలనలోకి తీసుకుని ‘విసారణై’ని మన ఎంట్రీగా ఎంపిక చేశాం’’ అన్నారు.
 
 ‘‘మా జ్యూరీ మెంబర్లలో తమిళ సభ్యులెవరూ లేరు. ఎంపికలో జ్యూరీపై ఎలాంటి ఒత్తిడులూ లేవు. ఉత్తమ విదేశీ భాషా చిత్రాల ఎంట్రీల సంఖ్య పెంచాలని ఆస్కార్ కమిటీకి విన్నవిస్తాం’’ అని ఆయన తెలిపారు. ఏయే భాషల నుంచి ఏయే చిత్రాలను జ్యూరీ పరిశీలించిందో వెల్లడించేందుకు మాత్రం నిరాకరించారు. తెలుగు ఫిలిమ్ చాంబర్ అధ్యక్షుడు, నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ- ‘‘విసారణై’ని ఆస్కార్ ఎంట్రీకి నామినేట్ చేసినందుకు కృతజ్ఞతలు.
 
  నార్తిండియన్ జ్యూరీ సభ్యులు సౌత్ ఇండియన్ చిత్రాన్ని ఎంపిక చేయడం సంతోషం’’ అన్నారు. నిర్మాత కల్యాణ్ ఈ చిత్రాన్ని ఇప్పటికే తెలుగులో ‘విచారణ’ పేరుతో అనువదించి, రిలీజ్‌కు సిద్ధం చేస్తుండడం విశేషం. ఈ సమావేశంలో ఎఫ్.ఎఫ్.ఐ చైర్మన్ టీపీ అగర్వాల్, జ్యూరీ మెంబర్లు పాల్గొన్నారు. రానున్న 89వ ఆస్కార్ అవార్డు వేడుకలు ఫిబ్రవరిలో లాస్ ఏంజెల్స్‌లో జరగనున్నాయి.