శ్రుతి బాటలో..

25 Jun, 2018 08:11 IST|Sakshi

తమిళసినిమా: సినిమా ఇతర రంగాలకు కాస్త భిన్నమైందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక్కడ రిస్క్‌ ఎక్కువే, ఆకర్షణ, క్రేజ్‌ ఎక్కువే. అలా లక్కుకిక్కు ఉన్న పరిశ్రమ సినిమా. ఈ రంగంలోకి ఒక్కసారి వస్తే, తిరిగి వెళ్లడం అంత సులభం కాదు. ఇక నటి కాజల్‌ అగర్వాల్‌ విషయానికి వస్తే 2004లో బాలీవుడ్‌లో నటిగా ఎంట్రీ ఇచ్చినా అక్కడ ఎవరూ గుర్తించలేదు. దీంతో దక్షిణాది సినిమాపై గురి పెట్టింది. ఇక్కడ కూడా మొదట్లో తడబడ్డా ఆ తరువాత నిలదొక్కుకుంది. కాజల్‌ను స్టార్‌ను చేసింది తెలుగు చిత్రం మగధీరానే. ఆపై తమిళం, తెలుగు చిత్రాల్లో క్రేజీ కథానాయకిగా రాణిస్తోంది. 14 ఏళ్ల తన నట జీవితంలో కాజల్‌ చాలా ఎత్తుపల్లాలను చూసింది. ఆ మధ్య సినిమా నిరంతరం కాదని, చాలినంత సంపాదించుకుని ఇతర వ్యాపారాల్లో దృష్టి సారించాలని పేర్కొంది.

అలాంటిది ప్రస్తుతం తన నిర్ణయంలో మార్పు వచ్చింది. నిజానికి కాజల్‌అగర్వాల్‌కు ప్రస్తుతం అవకాశాలు తగ్గు ముఖం పట్టాయనే చెప్పాలి. ముఖ్యంగా కోలీవుడ్‌లో ప్యారిస్‌ ప్యారిస్‌ అనే ఒక్క చిత్రమే చేతిలో ఉంది. ఇకపోతే ఈ బ్యూటీ వేరే రంగంలోనూ పెట్టుబడి పెట్టి ఆదాయాన్ని గడిస్తోంది. మరో భాగస్వామితో కలిసి ముంబయిలో జ్యువెలరీషాప్‌ నడుపుతోంది. తాజాగా చిత్ర నిర్మాణం చేపట్టాలన్న ఆలోచనలో ఉందట. దీని గురించి ఈ బ్యూటీ ఏమంటుందో చూద్దాం. జ్యువెలరీ వ్యాపారాన్ని మరింత విస్తరించే పనిలో ఉన్నాను.. అదే విధంగా మంచి స్క్రిప్ట్‌ దొరికితే చిత్ర నిర్మాణం చేపట్టాలన్న ఆశ ఉంది. సరైన సందర్భం వచ్చినప్పుడు చిత్ర నిర్మాతగా అవతారమెత్తుతాను అని చెప్పింది. ఇటీవలే నటి శ్రుతిహాసన్‌ చిత్ర నిర్మాణంలోకి దిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాను సైతం అంటోందన్న మాట కాజల్‌. సరే ఇంతకీ ఈ ముద్దుగుమ్మ  తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తోంది. మరి ఏ భాషలో చిత్రాన్ని నిర్మిస్తుందో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు