ఐఏఎస్‌ ఉద్యోగానికి రాజీనామా.. డైరెక్టర్‌గా అప్పుడు జాతీయ అవార్డు.. ఇప్పుడు బాక్సాఫీస్‌ వద్ద ఫ్లాప్‌..

15 Nov, 2023 12:05 IST|Sakshi

ఐఏఎస్‌.. ఐపీఎస్‌ కావాలని చాలామంది కలలు కంటుంటారు. కానీ లక్షల మందిలో అతికొద్ది మందికి మాత్రమే ఆ అదృష్టం వరిస్తుంది. ఇక్కడ చెప్పుకునే వ్యక్తి కూడా ఎంతో కష్టపడి ఐఏఎస్‌ ఉద్యోగం కొట్టాడు. తనకు పోస్టింగ్‌ వేసిన చోట సమర్థవంతంగా పని చేసి శెభాష్‌ అనిపించుకున్నాడు. కానీ కొన్నేళ్లకు తానే స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టాడు. ఇంతకీ ఆయన మరెవరో కాదు, పాపారావు బియ్యాల. ఈ తెలుగోడి పేరు మీరు వినే ఉంటారు. ఆయన గురించే నేటి ప్రత్యేక కథనం..

మధ్యలోనే ఆగిపోయిన పీహెచ్‌డీ
పాపారావు బియ్యాల.. వరంగల్‌లో 1954వ సంవత్సరంలో జన్మించాడు. ఆయన తండ్రి కిషన్‌ రావు స్వాతంత్య్ర సమరయోధుడు, తల్లి అనసూయా దేవి గృహిణి. వరంగల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన పాపారావు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ పట్టా అందుకున్నాడు. పీహెచ్‌డీ కోసం న్యూఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చేరాడు. కానీ అంతలోనే ఐఏఎస్‌ పరీక్ష రాయడం, అందులో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో పీహెచ్‌డీ మధ్యలోనే ఆపేశాడు. 1982లో ఐఏఎస్‌ సాధించిన ఇతడు కీలక హోదాల్లో విధులు నిర్వహించాడు.

సేవల్లోనూ మేటి
అస్సాంలోని జోర్హాట్‌ జిల్లాకు డిప్యూటీ కమిషనర్‌గా, తర్వాత ఆ రాష్ట్ర హోం సెక్రటరీగా సేవలందించాడు. జోర్హాట్‌ జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా ఉన్నప్పుడు తీవ్రవాదులకు వ్యతిరేకంగా జిల్లాస్థాయిలో పోలీసు, సైనిక బలగాలను సమన్వయం చేశాడు. 1992లో నదీకోత వల్ల ఇళ్లు కొట్టుకుపోయిన దాదాపు 500 కుటుంబాలకు కొత్త గ్రామాన్ని సృష్టించేందుకు సాయపడ్డాడు. అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఐదేళ్లపాటు పనిచేశాడు. డ్రగ్స్‌ రహిత క్రీడలను ప్రోత్సహించడం కోసం 'క్లీన్‌ స్పోర్ట్స్‌ ఇండియా' అనే స్వచ్ఛంద సంస్థనూ ఏర్పాటు చేశాడు. ఉన్నట్లుండి 2005లో ఐఏఎస్‌ పదవికి రాజీనామా చేశాడు.

తొలి చిత్రంతోనే జాతీయ అవార్డు
ఆ తర్వాత  2014-19వరకు తెలంగాణ ప్రభుత్వానికి పాలసీ అడ్వైజర్‌గా కొనసాగాడు. అయితే ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడే 1996లో న్యూయార్క్‌ ఫిలిం అకాడమీలో 3 నెలల కోర్సు చేశాడు. 1998లో 'విల్లింగ్‌ టు సాక్రిఫైస్‌' అనే డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిలిం తీశాడు. ఈ మూవీ 2000వ సంవత్సరంలో ఉత్తమ పర్యావరణ పరిరక్షణ చిత్రంగా జాతీయ అవార్డు గెలుచుకుంది. ఈ సంతోషంతో వెంటనే సినిమాలు చేయలేదు. చాలా గ్యాప్‌ తీసుకుని ఈ ఏడాది మ్యూజిక్‌ స్కూల్‌ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. శ్రియ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా మే 12న విడుదలవగా బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. మరి నెక్స్ట్‌ ఆయన ఎటువంటి సినిమాతో ముందుకు వస్తాడో చూడాలి!

చదవండి: పార్టీలో స్టెప్పులేసిన చిరంజీవి.. 68 ఏళ్ల వయసులో ఆ స్వాగ్‌ ఏంటి బాసూ..

మరిన్ని వార్తలు