మహిళా కంటెస్టంట్‌లకు క్లాస్‌ పీకిన బిగ్‌బాస్‌

10 Jul, 2018 21:09 IST|Sakshi
కమలహాసన్‌

సాక్షి, చెన్నై: తమిళంలో గత ఏడాది ప్రారంభమైన బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షో బాగా ప్రాచుర్యం పొందింది. దీంతో ఇప్పుడు సీజన్‌-2 నడుస్తోంది. మొదటి భాగానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన కమలహాసన్‌నే ఈ సీజన్‌కు ఆ బాధ్యతను చేపడుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సీజన్‌లో బిగ్‌బాస్‌ కుటుంబసభ్యులుగా పాల్గొన్న వారిలో కొందరు అసభ్యంగా ప్రవర్తిస్తుండడాన్ని కమలహాసన్‌ ఖండించారు. ఆదివారం ఎపిసోడ్‌లో పాల్గొన్న కమలహాసన్‌ బిగ్‌బాస్‌ సభ్యుల్లో నటుడు మహత్‌ రాత్రివేళ మహిళల గదిలో పడుకోవడం, అతను, నటి యాషికా సన్నిహితంగా ఉండడం వంటి సంఘటనపై సహ కుటుంబ సభ్యుడు పొన్నంబళంని తీవ్రంగా ఖండించారు. 

మహిత్, యాషికా, ఐశ్వర్యదత్‌ల అసభ్య ప్రవర్తన ఆయనకు నచ్చలేదు. ఇక్కడ కొందరు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని, అలా జరగకూడదని, ఈ షోను ఆబాలగోపాలం వీక్షిస్తున్నారని, మనకంటూ ఓ సంప్రదాయం ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నటుడు పొన్నంబళం వ్యాఖ్యల్ని కమలహాసన్‌ సమర్థించారు. పొన్నంబళం, వైద్యనాథన్‌ బిగ్‌బాస్‌ హౌస్‌పై మర్యాద కలిగిన వారని పేర్కొన్నారు. మగవారు చేసే తప్పులను మహిళలు చెయ్యకూడదని, పురుషులు కంటే కూడా మంచి కార్యాలను చేసి స్త్రీలు వారిని మార్చవచ్చునని వారికి క్లాస్‌ పీకారు.

సద్వినియోగం చేసుకోండి: మీరు ఇంకా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోలేదని కమల్‌హాసన్‌ అన్నారు. దీన్ని మీరు హితబోధ అనో, హెచ్చరికగానో, టిప్స్‌ అనో ఏదైనా అనుకోండని అన్నారు. మీకు ఇవ్వబడిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. సినిమాలో తానూ అలానే మంచి పేరు సంపాదించానని చెప్పారు. ఆరంభంలో తననెవరూ పట్టించుకోలేదన్నారు. అలాంటి సమయంలో దర్శకుడు కే.బాలచందర్‌ దృష్టిలో పడేలా కొన్ని కార్యాలు చేసి పేరు తెచ్చుకున్నానని తెలిపారు. మీరు మీరుగా ఉంటూ ఇక్కడ తప్పులను సరిదిద్దుకోండని కమలహాసన్‌ హితవు పలికారు.
 

మరిన్ని వార్తలు