‘షరతు ప్రకారం మగవారితో మాట్లాడలేదు’

30 Nov, 2019 08:44 IST|Sakshi

బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ 11వ సీజన్‌ ముగిసింది. షో చివరి ఎపిసోడ్‌లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్, ప్రముఖ రచయిత్రి సుధామూర్తి పాల్గొన్నారు. సుధామూర్తిని వేదికపైకి సాదరంగా ఆహ్వానించిన బిగ్‌బీ.. వయసులో చిన్నదైనా.. ఆమె కాళ్లకి నమస్కరించాడు. ఈ సందర్భంగా అమితాబ్‌ మాట్లాడుతూ.. సుధామూర్తి 60 వేల లైబ్రెరీలు, వందల స్కూళ్లు, 16 వేలకు మించిన టాయిలెట్లు కట్టించారని తెలిపారు. అనంతరం సుధామూర్తి తన నేపథ్యాన్ని వివరించారు. స్ఫూర్తిదాయకంగా,ఆదర్శవంతంగా సాగిన ఆమె జర్నీ గురించి స్వయంగా ఆమే వివరించారు. 

‘ నేను ఇంజనీరింగ్‌ చదవాలనుకున్నప్పుడు మా తండ్రి తిరస్కరించారు. అలా చేస్తే మన కమ్యూనీటీలో ఎవరూ నిన్ను పెళ్లి చేసుకోరాని హెచ్చరించారు. అయినప్పటికీ నేను ఇంజనీరింగ్‌ చదివేందుకే మొగ్గు చూపాను. కర్ణాటకలోని హుబ్లిలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో చేరాను. 599 మంది మగ విద్యార్థులు ఉన్న ఆ కాలేజీలో నేను ఒక్కదాన్నే మహిళా విద్యార్థిని. కాలేజీలో అడ్మిషన్ ఇచ్చే సమయంలో ప్రిన్సిపాల్ నాకు మూడు షరతులు విధించారు. అందులో ఒకటి ప్రతీరోజూ కాలేజీకి చీరకట్టులోనే రావాలి. రెండోది.. కాలేజీ క్యాంటీన్‌కి వెళ్లవద్దు. మూడవది..ఎట్టి పరిస్థితుల్లోనూ మగ విద్యార్థులెవరితోనూ మాట్లాడవద్దు.

మొదటి షరతు ప్రకారం ప్రతీరోజూ నేను చీరలోనే వెళ్లాను. కాలేజీ క్యాంటీన్ అసలేమాత్రం బాగుండదని.. కాబట్టి అక్కడికి ఎప్పుడు వెళ్లలేదు .ఇక కాలేజీలో చేరిన ఏడాది వరకు ఏ మగ విద్యార్థితోనూ మాట్లాడలేదు.. కానీ నేను టాపర్ కావడంతో వాళ్లే నా వద్దకు వచ్చి మాట్లాడేవారు’  అని సుధామూర్తి చెప్పుకొచ్చారు.

తాను చదువుకున్న కాలేజీలో కనీసం టాయిలెట్ వసతి కూడా లేదని చెప్పారు. అందుకే ఇన్ఫోసిస్ తరుపున దాదాపు 16వేల టాయిలెట్స్ నిర్మించినట్టు తెలిపారు. దేవదాసీ వ్యవస్థను రూపుమాపేందుకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తరుపున ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. ఆ సమయంలో ఎదురైన సవాళ్లను కూడా వివరించారు.

కాగా, ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ కార్యక్రమం దేశంలో అత్యంత రేటింగ్ సంపాదించుకున్న రియాలిటీ షోగా పేరొందింది. 19 ఏళ్ల కేబీసీ ప్రయాణంలో ఇప్పటికి 11 సీజన్లు పూర్తయ్యాయి. 10 సీజన్లకు అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరించారు.

మరిన్ని వార్తలు