బాపు, రమణల గీత, రాత కనిపిస్తాయి

1 Sep, 2015 00:10 IST|Sakshi
బాపు, రమణల గీత, రాత కనిపిస్తాయి

- కె. రాఘవేంద్రరావు
‘‘ఈ సినిమా టైటిల్ చాలా బాగుంది. ఈ సినిమా విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా’’ అని సీనియర్ దర్శకుడు కె. విశ్వనాథ్ ఆకాంక్షించారు. సుధాకర్ కోమాకుల, సుధీర్ వర్మ, చాందినీ చౌదరి ముఖ్యతారలుగా కె. రాఘవేంద్రరావు సమర్పణలో ఎస్.ఎల్.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ముళ్లపూడి వరా దర్శకత్వంలో జి.అనిల్‌కుమార్ రాజు, జి.వంశీకృష్ణ నిర్మించిన చిత్రం ‘కుందనపు బొమ్మ’.

ఎమ్.ఎమ్. కీరవాణి స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. కీరవాణి ఈ చిత్రం పాటలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ - ‘‘బాపు గారి గీత, రమణ గారి రాత ఈ చిత్రంలో కనిపిస్తాయి. అచ్చమైన తెలుగు టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది’’ అన్నారు.  రాజమౌళి మాట్లాడుతూ - ‘‘నేను రాఘవేంద్రరావు గారి దగ్గర సహాయ దర్శకునిగా చేరినప్పుడు వరా గారితో నాకు పరిచయం ఏర్పడింది.

ఈ సినిమా ట్రైలర్ చూడగానే, వెంటనే సినిమా చూడాలనిపిస్తోంది’’ అన్నారు. వరా ముళ్లపూడి మాట్లాడుతూ - ‘‘ఈ స్క్రిప్ట్ రాయడానికి ఏడాదిన్నర సమయం పట్టింది. కీరవాణి గారైతే కథ వినకుండా కేవలం సిట్యుయేషన్స్‌కి తగ్గట్టు మంచి పాటలిచ్చారు’’ అని చెప్పారు. ఈ వేడుకలో రచయితలు శివశక్తి దత్తా, అనంత శ్రీరామ్, దర్శకులు బి. గోపాల్, ప్రవీణ్ సత్తారు తదితరులు పాల్గొన్నారు.