సంప్రదాయబద్ధంగా మలయాళ సినీ పండుగ

24 Sep, 2013 02:04 IST|Sakshi
సంప్రదాయబద్ధంగా మలయాళ సినీ పండుగ
భారతీయ సినిమా శత వసంతాల వేడుకల్లో భాగంగా మలయాళ సినీ పరిశ్రమ కార్యక్రమాలు మంగళవారం సంప్రదాయబద్ధంగా సాగాయి. భారతీయ సినిమా శత వసంతాల వేడుకలు చెన్నైలో శనివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, కన్నడ సినీరంగాలకు సంబంధించిన వేడుకలు ఇప్పటికే పూర్తికాగా, మలయూళ పరిశ్రమ వేడుకలను కేంద్ర మంత్రి వయలార్ రవి, గ్రామీణాభివృద్ధి, సాంస్కృతిక నిర్వహణ శాఖ మంత్రి కె.సి.జోసఫ్ మంగళవారం ఉదయం ప్రారంభించారు. 
 
మలయాళ సినీ ప్రముఖులు మోహన్‌లాల్, మమ్ముట్టి, సురేష్ గోపి, జయరాం తదితరులు సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. మలయాళ సినిమాకు ఆద్యుడైన జె.సి.డేనియల్ తదితరులను స్మరించుకున్నారు. విశిష్ట సేవలు అందించిన కళాకారులను ఘనంగా సత్కరించారు. ఉన్నత ప్రమాణాలను పాటిస్తోందంటూ మలయూళ సినీ పరిశ్రమపై వక్తలు ప్రశంసల వర్షం కురిపించారు. 
 
 అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. యువ నటీమణులు పూర్ణ, రమ్యా నంబీశన్, మీరానందన్, రీమా కళింగళ్, అపర్ణ నాయర్ తదితరులు అలనాటి ఆణి ముత్యాల్లాంటి పాటలకు నర్తించారు. ఈ కార్యక్రమంలో కమలహాసన్, శారద, సుహాసిని, కాంచన, షీలా, అంబిక, గాయని చిత్ర తదితరులు పాల్గొన్నారు.