చంద్రబాబుకు మైండ్ దొబ్బింది: కేసీఆర్ | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు మైండ్ దొబ్బింది: కేసీఆర్

Published Tue, Sep 24 2013 1:56 AM

Chandrababu Naidu mental conditon not good, says KCR

ప్రజలు కొడుతున్న దెబ్బలతో ఆయన మానసిక పరిస్థితిలో మార్పు వచ్చింది: కేసీఆర్
 
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు మైండ్ దొబ్బిందని, ఆయన మానసిక పరిస్థితిలో తేడా వచ్చిందని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. ‘ప్రజలు కొడుతున్న దెబ్బలతో ఆయన మానసిక పరిస్థితిలో తేడా వచ్చింది. పి టర్న్ అట. అంటే ఏంది? ఎవరిని మోసం చేయడానికీ టర్నుల మీద టర్నులు? ఎన్నిసార్లు తీసుకుంటావు ఈ టర్నులు? డిసెంబర్ 7 నాడొక టర్న్, 9 నాడొక టర్న్, ఆ తరువాత రెండుకండ్ల టర్న్, ఇప్పుడేమో పి టర్న్ అట. శ్రీరంగనీతులు చెబుతూ ఢిల్లీలో చీకటి వ్యవహారాలు చేస్తున్నడు. ఏం చెప్పినా సీమాంధ్ర టర్నే. ఎందుకీ కంఠశోష తెలంగాణకు వ్యతిరేకినని సూటిగా చెప్పు. తెలంగాణ తెలుగుదేశం నాయకులు ఇంకా సిగ్గూ, లజ్జా లేకుండా అక్కణ్ణే పడి ఉంటరా? దేభ్యపు ముఖాలేసుకుని ఉండకుండా పాపాలను కడుక్కోండి. పాపాల భైరవునివంటి చంద్రబాబుని విడిచిపెట్టి తెలంగాణ ప్రజలతో కలవండి..’ అంటూ కేసీఆర్ మండిపడ్డారు. ఆయన సోమవారం టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరోసభ్యులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జిలతో తెలంగాణభవన్‌లో సమావేశమయ్యారు.
 
 అనంతరం  మీడియాతో మాట్లాడారు. ‘సీమాంధ్రకు ప్యాకేజీ అని చంద్రబాబు ఎట్లా అంటరు? సమైక్యపాలనలో తెలంగాణ.. వనరులు, నీళ్లు, ఉపాధి, ఉద్యోగ, విద్యారంగాల్లో దోపిడీకి గురయింది. ఎంతో కష్టపడి, నష్టపోయి గోస పడ్డది. నష్టపోయిన తెలంగాణకు పరిహారం ఇస్తరా? లాభపడిన ఆంధ్రాకు పరిహారం ఇస్తరా? ఏమన్నా మాట్లాడితే హద్దూపద్దూ ఉండాలి’ అని అన్నారు. హైదరాబాద్ నుండి తెలంగాణవారు కూడా పోవాలని ఏపీఎన్‌జీఓ అధ్యక్షుడు అశోక్‌బాబు డిమాండ్ చేస్తున్నారు కదా అని ఒక విలేకరి ప్రశ్నించగా.. ‘ఆయన గురించి పట్టించుకోవాల్సిన పనిలేదు. తెలంగాణవారు హైదరాబాద్ నుండి వెళ్లాలనడం పనికిమాలినతనం, హాస్యాస్పదం..’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్టానంతో టచ్‌లోనే ఉన్నానని, చాలా అంశాల పై మాట్లాడుతున్నట్లు తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పూర్తవుతుందని చెప్పారు.
 
10 ఏండ్ల దాకా హైదరాబాద్‌కు ఓకే...
తెలంగాణ ప్రజలను ఎన్ని కష్టాలు పెట్టినా వారికి మానవీయత ఉందని కేసీఆర్ అన్నారు. పదేళ్ల పాటు హైదరాబాద్ నుండి ఆంధ్రా రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలను నిర్వహించుకుంటే అభ్యంతరం లేదని చెప్పారు. ఆంధ్రా ప్రభుత్వ ఖజానా నుండి జీతాలు తీసుకుని హైదరాబాద్‌లో పన్నులు కడతామని, ఇంకా ఇక్కడే ఉంటామని వారంటే ఎవరికైనా అభ్యంతరం ఏమిటని కేసీఆర్ ప్రశ్నించారు.  
 
ఐటీ ప్రాజెక్టు కొత్తదేమీ కాదు
హైదరాబాద్ అభివృద్ధి కోసం చంద్రబాబు, వైఎస్ వంటి సీమాంధ్ర రాజకీయ నాయకులు చేసిందేమీ లేదని కేసీఆర్ అన్నారు. స్వాతంత్య్రం వచ్చేనాటికే హైదరాబాద్‌లో 106 పరిశ్రమలున్నాయని తెలిపారు. అభివృద్ధి చేసినట్టుగా చెప్పుకుంటున్న వారెవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప ఏమీ చేయలేదని పేర్కొన్నారు. రూ.2.19 లక్షల కోట్లతో 20 ఏండ్ల కాలంలో ఐటీఐఆర్ ప్రాజెక్టును ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈనాటిది కాదని, నాలుగైదేండ్లుగా దీనిపై చర్చ జరుగుతున్నదని వివరించారు.

అమెరికాలోని సిలికాన్‌వ్యాలీ, చైనాలోని సాంజల్ నగరాలు రెండూ కలిపి హైదరాబాద్‌లో ఆవిష్కృతం కానున్నాయని చెప్పారు. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 65 లక్షల మందికి ఉపాధి వస్తుందన్నారు. మేధావినని చెప్పుకునే జయప్రకాశ్ నారాయణ వంటి రిటైర్డు ఐఏఎస్ అధికారి కూడా దీనిపై విషం చిమ్మే విధంగా మాట్లాడటం దురదృష్టకరమని కేసీఆర్ వ్యాఖ్యానించారు.  
 
సకల జనభేరికి భారీగా తరలాలి
ఈ నెల 29న హైదరాబాద్‌లో జరిగే సకల జనభేరి సదస్సుకు భారీగా తెలంగాణవాదులు తరలిరావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రతి ఎమ్మెల్యే 5 వేలమందిని, మిగిలిన నియోజకవర్గాల నుండి వెయ్యి మందిని సకల జనభేరి సదస్సుకు తరలించాలని  నేతలకు సూచించారు. సిరిసిల్లకు చెందిన నేత కార్మికులు అగ్గిపెట్టెలో ఒదిగిపోయే శాలువాను, చీరను ఈ సమావేశంలో కేసీఆర్‌కు అందజేశారు. బి.జగన్‌మోహన్‌రావు రాసిన ‘కేసీఆర్ ఉద్యమస్ఫూర్తి-తెలంగాణ’ పుస్తకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు.

Advertisement
Advertisement