ఆ రెండిటికీ లింకు పెట్టకూడదు – మారుతి 

11 Jul, 2018 00:31 IST|Sakshi

‘‘నేను తొలిసారి పూర్తిగా మాటలు, స్క్రిప్ట్‌ అందించిన సినిమా ఇది. శైలేంద్రబాబుగారికి న్యారేట్‌ చేశా. డైరెక్టర్‌గా చాలా మందిని అనుకున్నా ప్రభాకర్‌గారే కరెక్ట్‌ అనిపించింది. ఒక సినిమా ఫెయిల్‌ అయితే కథ ఫెయిల్‌ అయినట్లే తప్ప.. టెక్నీషియన్‌ ఫెయిల్‌ అయినట్లు కాదని నేను నమ్ముతాను. ఫెయిల్యూర్‌కి, టెక్నీషియన్‌కి లింకు పెట్టకూడదు. ఈ సినిమాని అందరూ ప్రేమించి చేశారు’’ అని దర్శకుడు మారుతి అన్నారు. సుమంత్‌ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత పొన్నాడ, మురళీశర్మ ముఖ్య తారలుగా ప్రభాకర్‌.పి దర్శకత్వంలో మారుతి సమర్పణలో ఎస్‌.శైలేంద్రబాబు నిర్మించిన చిత్రం ‘బ్రాండ్‌ బాబు’. ఈ సినిమా టీజర్‌ను డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘మారుతి చాలా సార్లు తన ఫంక్షన్లకు పిలిచినా రాలేకపోయాను.

ఈ సినిమాకు రాకపోతే ఇంకోసారి పిలవనన్నాడు. నాకు చాలా థాట్స్‌ ఉంటాయి. కానీ, రాయడానికి చాలా సమయం పడుతుంది.  మారుతి సింపుల్‌గా కథ రాస్తాడు. అందుకే తనంటే విపరీతమైన గౌరవం’’ అన్నారు. ‘‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ తర్వాత తెలుగులో నేను నిర్మించిన చిత్రం ‘బ్రాండ్‌ బాబు’. ఈ సినిమా ద్వారా నా తనయుడు సుమంత్‌ని హీరోగా పరిచయం చేస్తున్నాను’’ అన్నారు ఎస్‌.శైలేంద్రబాబు. ‘‘సినిమా సక్సెస్‌ అయితే ఎవరైనా అవకాశం ఇస్తారు. అంతంత మాత్రమే ఆడిన నా సినిమా (నెక్ట్స్‌ నువ్వే) చూసి నువ్వు బాగానే డైరెక్ట్‌ చేశావ్‌ అని మారుతిగారు మెచ్చుకుని నాకు ఈ సినిమాకి చాన్స్‌ ఇచ్చారు’’ అన్నారు ప్రభాకర్‌. సుమంత్‌ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత పొన్నాడ, రాజా రవీంద్ర, పూర్ణాచారి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు