రక్తదానం చేసి ప్రాణాలు కాపాడండి

20 Apr, 2020 02:13 IST|Sakshi
చిరంజీవి

‘‘కరోనా వైరస్‌ నేపథ్యంలో నెలకొన్న లాక్‌డౌన్‌ వల్ల రక్త దాతల కొరత ఏర్పడింది. ఈ కారణంగా ధీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రక్తం అవసరం ఉన్న వారికి లాక్‌డౌన్‌ పెను సమస్యాత్మకంగా మారింది. ఈ పరిస్థితుల్లో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడండి’’ అంటూ హీరో చిరంజీవి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌కి చిరంజీవి ఆదివారం స్వయంగా వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో బ్లడ్‌ బ్యాంక్స్‌లో రక్త నిల్వలు తగడంతో ఆస్పత్రి వర్గాల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తలసేమియా, క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులు, బైపాస్‌ సర్జరీ, హార్ట్‌ పేషెంట్స్, ప్రమాదాలకు గురైన వారు, ఎనీమియా వంటి సమస్యలు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రక్తం లేక ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకునేందుకు ప్రజలు, మెగా అభిమానులు ముందుకు రావాలి. మీకు సమీపంలోని బ్లడ్‌ బ్యాంక్స్‌కి వెళ్లి రక్తదానం చేయండి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రక్తదానం చేసేందుకు పోలీసుల వల్ల ఎటువంటి ఇబ్బంది తలెత్తదు. రక్తదానం చేస్తామని సమీపంలోని బ్లడ్‌ బ్యాంక్‌ వారికి చెప్పగానే మీ ఫోన్‌ వాట్సాప్‌కు పాస్‌ వస్తుంది.. అది పోలీసులకు చూపిస్తే సరిపోతుంది’’ అన్నారు. చిరంజీవితో సహా హీరో శ్రీకాంత్, ఆయన తనయుడు రోషన్, శ్రీమిత్ర చౌదరి, ఆయన వారసులు తేజ్‌ నివాస్, తేజ్‌ గోవింద్, నటులు బెనర్జీ, భూపాల్, గోవిందరావు, విజయ్, ‘సంతోషం’ పత్రికాధినేత, నిర్మాత సురేష్‌ కొండేటి తదితరులు రక్తదానం చేసిన వారిలో ఉన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు