Chiranjeevi: కేసీఆర్‌ను పరామర్శించిన చిరంజీవి..

11 Dec, 2023 17:07 IST|Sakshi

బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల ఆయనకు తుంటి ఆపరేషన్‌ జరగ్గా ఆస్పత్రిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి ఆయనను పరామర్శించేందుకు యశోద ఆస్పత్రికి వెళ్లాడు. ఆయనతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నాడు.  కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. సర్జరీ చేసిన డాక్టర్లకు అభినందనలు తెలిపాడు. కేసీఆర్‌ సినిమా ఇండస్ట్రీ గురించి అడిగారని, సినిమాలు ఎలా ఆడుతున్నాయని అడిగారన్నాడు. సినీ పరిశ్రమలో అంతా బాగానే జరుగుతోందని చెప్పానన్నాడు.

కేసీఆర్‌ ఆరోగ్యం ఎలా ఉందంటే?
ఇటీవల ​కేసీఆర్‌ తన ఇంట్లో జారిపడ్డారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. కేసీఆర్‌ను పరీక్షించిన వైద్యులు ఆయనకు ఎడమకాలు తుంటిలో ఫ్యాక్చర్‌ అయినట్లు గుర్తించారు. దీంతో టోటల్ హిప్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ చేశారు. దాదాపు ఎనిమిది వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. సాధారణంగా తుంటి మార్పిడి సర్జరీ చేయించుకున్న అనంతరం రెండు రోజుల్లోనే డిశ్చార్జ్‌ చేస్తారు. అయితే వయసు, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని డిశ్చార్జిని కొద్దిగా పొడిగించినట్టు తెలుస్తోంది.

చిరంజీవి విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం 156వ సినిమా చేస్తున్నాడు. బింబిసార ఫేమ్‌ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్‌ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు.

చదవండి: గుడ్‌న్యూస్‌ చెప్పిన గీతా మాధురి.. మరోసారి తండ్రి కాబోతున్న నందు..

>
మరిన్ని వార్తలు