మెర్శల్‌కు ట్రేడ్‌మార్క్‌

30 Aug, 2017 02:39 IST|Sakshi
మెర్శల్‌కు ట్రేడ్‌మార్క్‌

తమిళసినిమా: మెర్శల్‌ చిత్రం పలు విశేషాలతో అభిమానుల్లో జోష్‌ పెంచేస్తోంది. విజయ్‌ నటిస్తున్న తాజా చిత్రం మెర్శల్‌. ఆయన త్రిపాత్రాభినయం చేస్తున్న ఇందులో సమంత, కాజల్‌అగర్వాల్, నిత్యామీనన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. తెరి వంటి విజయవంతమైన చిత్రం తరువాత విజయ్‌ను అట్లీ డైరెక్ట్‌ చేస్తున్న చిత్రం ఇది. శ్రీ తేనాండాళ్‌ ఫిలింస్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం మెర్శల్‌. సంగీత మాంత్రికుడు ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఇటీవల ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. షూటింగ్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న మెర్శల్‌ చిత్రాన్ని దీపావళి సందర్భంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

కాగా ఇందులో మెజీషియన్‌ పాత్ర కోసం విజయ్‌ ప్రత్యేకంగా మ్యాజిక్‌ను నేర్చుకుని మరీ నటించారట. ఈ పాత్ర ఆయన అభిమానులను విశేషంగా అలరిస్తుందంటున్నారు. మరో విషయం ఏమిటంటే మెర్శల్‌ చిత్రం కోసం ట్విట్టర్‌లో ప్రత్యేక ఇమోజీలను ప్రవేశపెట్టారు. తాజాగా మరో విశేషాన్ని మెర్శల్‌ చిత్రం సంతరించుకుంది. మెర్శల్‌ పేరుకు ట్రేడ్‌మార్క్‌ను చిత్ర నిర్మాతలు పొందారు. ఇలా ట్రేడ్‌మార్క్‌ను చిత్ర టైటిల్‌కు పొందడం అన్నది దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రప్రథమం అవుతుంది. ట్రేడ్‌మార్క్‌ కారణంగా మెర్శల్‌ పేరును ఏ ఇతర వాణిజ్య ప్రకటనకు వాడినా వారు ఈ చిత్ర నిర్మాతకు రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆ విధంగా లక్షలాది రూపాయల లబ్ధి పొందడానికే శ్రీ తేనాండాళ్‌ ఫిలింస్‌ అధినేతలు మెర్శల్‌ చిత్రానికి ట్రేడ్‌మార్క్‌ను పొందినట్లు సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా