నటికి అన్యాయం.. సూపర్‌స్టార్‌కు షాక్‌!

23 Jul, 2018 16:52 IST|Sakshi
మోహన్‌లాల్‌ (పాత చిత్రం)

తిరువనంతపురం : మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. కేరళ ప్రభుత్వం ప్రకటించే సినిమా అవార్డుల ఫంక్షన్‌కు ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరుకానివ్వరాదని ఫిల్మ్‌ ఇండస్ట్రీ నుంచే వాదనలు వినిపిస్తున్నాయి. 100కు పైగా సినీ సెలబ్రిటీలు మోహన్‌లాల్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం ఇండస్ట్రీలో చర్చనీయాశంగా మారింది. జాతీయ అవార్డు సాధించిన దర్శకుడు బిజుకుమార్‌ దామోదరణ్‌ అలియాస్ డీఆర్‌ బిజు ఇందుకు సంబంధించి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఓ నటికి అన్యాయం చేసిన నటుడికి ఆ గౌరవం ఇవ్వరాదని తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో రాసుకొచ్చారు.

నటీనటులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఈ సినీ అవార్డులను ఆహ్లాదకర వాతావరణంలో ఇవ్వాలి. అంతేకానీ ఆర్టిస్టులు వ్యతిరేకిస్తున్న వ్యక్తి సమక్షంలో, అందులోనూ ఆయన చీఫ్‌ గెస్ట్‌గా అవార్డు తీసుకోవడానికి ఎవ్వరూ ఇష్ట పడటం లేదు. అంతగా కావాలంటే సాంస్కృతికశాఖ మంత్రి సమక్షంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా సినీ అవార్డులు అందివ్వడం ఉత్తమమని’ డైరెక్టర్‌ డీఆర్‌ బిజు తన ఫేస్‌బుక్‌లో చేసిన పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. ప్రకాష్‌రాజ్‌, ఎన్‌ఎస్‌ మాధవన్‌, సచిదానందన్‌, కేజీ శంకరన్‌ పిళ్లై, రాజీవ్‌ రవి, బినా పాల్‌, రిమా కల్లింగల్‌, శృతి హరహరన్‌, పలువురు సెలబ్రిటీలు మోహన్‌లాల్‌ను చీఫ్‌ గెస్ట్‌గా పిలవడాన్ని వ్యతిరేకిస్తున్న వారిలో ఉన్నారని తెలిపారు. 

అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మావీ ఆర్టిస్ట్స్(అమ్మ) అధ్యక్షుడిగా మోహన్‌లాల్‌ ఉన్నారు. అయితే నటి భావన కిడ్నాప్, వేధింపుల కేసు విచారణలో ఉండగానే నటుడు దిలీప్‌ను ‘అమ్మ’లో తిరిగి చేర్చుకోవడాన్ని అసోసియేషన్‌కు చెందిన పలువురు బహిరంగంగానే విమర్శించారు. నటికి సాయం చేయాలన్నా, ఆమెకు నిజంగా న్యాయం జరగాలంటే దిలీప్‌ను అసోసియేషన్‌ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని మలయాళ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు కోరినా ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలో జరగనున్న అవార్డు పంపిణీ కార్యక్రమానికి మోహన్‌లాల్‌ను చీఫ్‌ గెస్ట్‌గా పిలవొద్దని డిమాండ్ చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు