చచ్చేదాకా కలిసి ఉండటమే

8 Oct, 2018 02:56 IST|Sakshi
రామస్వామి, సౌమ్య

‘అర్ధనారి’ ఫేమ్‌ అర్జున్‌ యజత్, సౌమ్య వేణుగోపాల్, భరత్‌ బండారు, పావని, రామస్వామి, సీమా చౌదరి కీలక పాత్రల్లో రూపొందిన చిత్రం ‘మూడు పువ్వులు ఆరు కాయలు’. రామస్వామి దర్శకత్వంలో డాక్టర్‌ మల్లె శ్రీనివాస్‌ సమర్పణలో వెంకట్రావు నిర్మించిన ఈ సినిమా ఈనెల 12న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. పాటల రచయిత భాస్కరభట్ల, సంగీత దర్శకుడు సాయికార్తీక్‌ చిత్ర ట్రైలర్‌ను, పాటలను విడుదల చేశారు. రామస్వామి మాట్లాడుతూ– ‘‘ప్రేమంటే చంపుకోవడమో, చావడమో కాదు.. చచ్చేదాకా కలిసి బతకటం.

కన్నవాళ్ల కలలతో పాటు, ఆశించిన లక్ష్యాన్ని చేరుకోగలిగితే ప్రతి ఒక్కరి జీవితం ‘మూడు పువ్వులు ఆరు కాయలు’గా వర్ధిల్లుతుంది. మా నిర్మాత, సమర్పకులే నన్ను నడిపించారు. మా చిత్రంలో చంద్రబోస్‌గారు రాసిన పాట గురించి ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకుంటారు’’ అన్నారు. ‘‘మా స్మైల్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో ఇది తొలి సినిమా. మా టీమ్‌ చాలా కష్టపడి చేశారు’’ అన్నారు వెంకట్రావు. చిత్ర సమర్పకులు డా. మల్లె శ్రీనివాస్, డైరెక్టర్‌ దేవీప్రసాద్, నటులు భరత్, అర్జున్‌ యజత్, పావని, సీమా చౌదరి, సంగీత దర్శకుడు కృష్ణసాయి, ఆర్ట్‌ డైరక్టర్‌ రమణ, ‘ఆదిత్య’ మ్యూజిక్‌ నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు