సేన్‌, రేల మధ్య వైరుధ్య బంధం

31 Dec, 2018 18:57 IST|Sakshi
సేన్‌, రే (ఫైల్‌ ఫొటోలు)

సాక్షి, న్యూఢిల్లీ : ‘కళాత్మక చిత్రాలు తీస్తామని చెప్పుకునే వారందరికి విదేశాల్లో జరిగే చలన చిత్రోత్సవాల్లో పొల్గొనాలనే ధ్యాస తప్పించి, భారత ప్రేక్షకులను ఆకర్షించాలనే దృష్టి లేదు. కథ ఎలా చెప్పాలో తెల్సిన మృణాల్‌ సేన్‌ కూడా వారిలో ఒకరే’ అని ఆస్కార్‌ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శక నిర్మాత సత్యజిత్‌ రాయ్‌ రాసిన ఓ లేఖలోని వ్యాఖ్యలివి. మృణాల్‌ సేన్‌ తీసిన దాదాపు అన్ని సినిమాల గురించి విమర్శనాత్మక దృక్పథంతోనే మాట్లాడిన సత్యజిత్‌ రే ఆయన్ని విమర్శిస్తూ ప్రముఖ సినీ విమర్శకుడు చిదానంత గుప్తాకు (1991, జూన్‌లో) రాసిన ఆఖరి లేఖలోనిది ఈ వ్యాఖ్య. ఈ లేఖ ప్రతిని ఓ జాతీయ పత్రిక 1991, అక్టోబర్‌లో వెలుగులోకి తీసుకొచ్చింది.

ఈ వ్యాఖ్యలను చూసిన మృణాల్‌ సేన్‌ బాగా నొచ్చుకున్నారు. అప్పటికే సత్యజిత్‌ రే ఆస్పత్రిలో చేరి మృత్యువుతో పోరాడుతున్నారు. సినీ పాత్రికేయ లోకం మృణాల్‌ సేన్‌ను చుట్టుముట్టి, సత్యజిత్‌ రే చేసిన విమర్శలపై స్పందించాల్సిందిగా ఒత్తిడి తీసుకొచ్చారు. ‘సత్యజిత్‌ రే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మానసికంగా ఆయన ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన వేలకు మందులు తీసుకొని త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. అందుకని కళాత్మక విలువల గురించి. సినీ కళ గురించి నేనిప్పుడు చర్చించ దల్చుకోలేదు’ అని సేన్‌ వ్యాఖ్యానించారు. ఆయన ఆశించినట్లు సత్యజిత్‌ రే కోలుకోకుండా 1992, ఏప్రిల్‌ 23వ తేదీన కన్నుమూశారు. రే ఆస్పత్రిలో చేరిన దగ్గరి నుంచి ఆయన దహన సంస్కారాల వరకు మృణాల్‌ సేన్, రే కుటుంబం వెన్నంటే ఉన్నారు. అయితే అన్ని రోజులూ ఆయన కళ్లలో వెలుగు కోల్పోయిన ఛాయలే కనిపించాయి.

సత్యజిత్‌ రే విమర్శలకు మృణాల్‌ సేన్‌ నొచ్చుకోవడం అదే మొదటి సారి కాదు. 1965లో ఆయన తీసిన ‘ఆకాశ్‌ కుసమ్‌’ నుంచి 1969లో హిందీలో తీసిన తొలి చిత్రం ‘భువన్‌ షోమ్‌’ (కరీర్‌లో 9వ చిత్రం) మొదలుకొని దాదాపు అన్ని చిత్రాలపై సత్యజిత్‌ విమర్శలు చేశారు. తెలుగులో తీసిన ‘ఒక ఊరి కథ’తోపాటు ఒకటి రెండు హిందీ చిత్రాలను మెచ్చుకున్నారు. కేవలం రెండు లక్షల రూపాయలను మాత్రమే వెచ్చించి తీసిన హిందీ చిత్రం ‘భువన్‌ షోమ్‌’ సినీ విమర్శకులనే కాకుండా కమర్షియల్‌గా కూడా ఎంతో హిట్టయింది. కొత్త తరంగ చిత్రంగా సినీ విమర్శకులు దాన్ని కొనియాడగా, ఆ అందులో ఏముందీ, ప్రేక్షకులకు ఆకట్టుకునే కొన్ని పాపులర్‌ టెక్నిక్‌లు తప్ప అని సత్యజిత్‌ రే విమర్శించారు. ‘ఏ బిగ్‌ బ్యాడ్‌ బ్యూరోక్రట్‌ రిఫామ్డ్‌ బై రస్టిక్‌ బెల్లి’ అంటూ వ్యాఖ్యానించారు.

ఫ్రాంకోయా ట్రూఫాట్‌ చిత్రాల స్ఫూర్తితో మృణాల్‌ సేన్, సౌమిత్ర ఛటర్జీ, అపర్ణా సేన్‌ జంటగా  ‘ఆకాశ్‌ కుసమ్‌’ చిత్రాన్ని తీశారు. ఈ చిత్రంతోనే ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలయింది. నాడు ‘స్టేట్స్‌మేన్‌’ పత్రిక ఈ సినిమాపై బహిరంగ చర్చను నిర్వహించింది. సినీ విమర్శకులు కొందరు సేన్‌ వైపు నిలువగా, మరికొందరు రే వైపు వ్యాఖ్యానాలు చేశారు. ఈ విషయం చినికి చినికి గాలివానగా మారడంతో 1965, సెప్టెంబర్‌ 13వ తేదీన చర్చను నిలిపివేస్తున్నట్లు స్టేట్స్‌మేన్‌ పత్రిక ప్రకటించింది. రే చేసిన దాదాపు అన్ని విమర్శలకు సేన్‌ సమాధానం ఇచ్చినా రే అంత ఘాటుగా ఎప్పుడు స్పందించలేదు. రే తీసిన ‘పథేర్‌ పాంచాలి’, అపరాజిత సిరీస్‌ చిత్రాలను ప్రశంసించిన మృణాల్‌ సేన్‌ ‘పరాస్‌ పత్తర్‌’ చిత్రాన్ని తీవ్రంగానే విమర్శించారు. ఈ ఇరువురు మహా దర్శకులు వర్తమాన జీవన వైరుధ్యాలపై తమదైన దృక్పథంతో సినిమాలు తీసి సామాజిక ప్రయోజనానికి దోహదపడ్డారు. వీరిద్దరు తీసిన ‘పునస్క–మహానగర్, ప్రతివాండీ–ఇంటర్వ్యూ, బైషే శ్రావణ–ఆశని సంకేత్, కోరస్‌–హీరక్‌ రాజర్‌ దిశే’ చిత్రాల్లో కథాంశం దాదాపు ఒకటే అయినా భిన్న కోణాలు కల్పిస్తాయి.

ఒకప్పుడు మంచి మిత్రులే
ఒడ్డూ, పొడువు, ఛామన ఛాయలో ఒకే తీరుగా కనిపించే మృణాల్‌ సేన్, సత్‌జిత్‌ రేలు చర్చా వేదికలపై ఒకరినొకరు విమర్శించుకుంటూ గంభీరంగానే కనిపించేవారు. అంతకుముందు వారు చాలా సన్నిహిత మిత్రలు. చాప్లిన్‌ మీద మృణాల్‌ సేన్‌ రాసిన పుస్తకం కవర్‌ పేజీని సత్యజిత్‌ రే స్వయంగా డిజైన్‌ చేశారు. లేక్‌ టెంపుల్‌ రోడ్డులోని సత్యజిత్‌ రే ఫ్లాట్‌కు సేన్‌ తరచూ వెళ్లి గంటల తరబడి సినిమా ముచ్చట్లు పెట్టేవారు. భిన్నత్వంలో ఏకత్వంలా వైరుధ్యంలో ఏకత్వంగా వారి మధ్య మిత్రత్వం ఉండేది. రే జ్ఙాపకాలతో మృణాల్‌ సేన్‌ నిన్న, అంటే ఆదివారం లోకం విడిచి వెళ్లి పోయిన విషయం తెల్సిందే.

మరిన్ని వార్తలు