వేసవిలో సూర్యుడొస్తాడు!

4 Aug, 2017 07:23 IST|Sakshi
వేసవిలో సూర్యుడొస్తాడు!

... ఆ మాటకొస్తే ప్రతి ఉదయం సూర్యుడొస్తాడు. కానీ, వేసవిలో ఎక్కువసేపు మన తోడుగా, నీడగా వస్తుంటాడు. వచ్చే ఏడాది అదే టైమ్‌లో ప్రతిరోజూ ఉదయించే సూర్యుడితో పాటు మరో సూర్యుడు ‘నేనొస్తున్నా’ అంటున్నారు. ఆ సూర్యుడే అల్లు అర్జున్‌. ఎప్పుడూ మనదేశ ప్రజలకు తోడు–నీడగా ఉండే ఆర్మీ అధికారి సూర్యగా ఆయన నటిస్తున్న సినిమా ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’. వక్కంతం వంశీ దర్శకత్వంలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ నిన్న హైదరాబాద్‌లో మొదలైంది.

నిన్ననే సినిమా విడుదల తేదీనీ ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 27న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్లు నిర్మాత లగడపాటి శ్రీధర్‌ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ– ‘‘బన్నీ ఎనర్జీకి తగ్గట్టుగా రెడీ చేసిన ఈ కథలో కమర్షియల్‌ అంశాలన్నీ ఉన్నాయి. నాగబాబు–‘బన్నీ’ వాసుగార్ల ఆధ్వర్యంలో సినిమా ముందుకెళ్తున్నందుకు వెరీ హ్యాపీ’’ అన్నారు. కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్, ముఖ్య తారలుగా అర్జున్, శరత్‌కుమార్‌లు నటిస్తున్న ఈ సినిమాకు కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి), ఫైట్స్‌: రామ్‌–లక్ష్మణ్, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, కెమెరా: రాజీవ్‌ రవి, సంగీతం: విశాల్‌–శేఖర్, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: బాబు, సమర్పణ: కె. నాగబాబు, సహనిర్మాత: ‘బన్నీ’ వాసు.