ఇంట్లో ఇల్లాలు... గ్రౌండ్‌లో ప్రియురాలు

15 Jan, 2019 00:23 IST|Sakshi
దివ్యాంశ కౌశిక్, నాగచైతన్య

2017 అక్టోబర్‌ 6... నాగచైతన్య, సమంత తమ ప్రేమ ప్రయాణంలో పెళ్లి అనే ‘మజిలీ’ని చేరుకున్న రోజు. పెళ్లి తర్వాత వారిద్దరూ కలిసి నటిస్తున్న మొదటి చిత్రం ‘మజిలీ’. ఇందులో ఇద్దరూ భార్యాభర్తలుగానే నటిస్తున్నారు. ‘దేర్‌ ఈజ్‌ లవ్‌.. దేర్‌ ఈజ్‌ పెయిన్‌’ అనేది ఉపశీర్షిక. షైన్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మిస్తున్నారు. ‘నిన్ను కోరి’ ఫేమ్‌ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 80 శాతం పైగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 5న విడుదల చేస్తున్నట్లు చిత్రనిర్మాతలు తెలిపారు. జనవరి 1న ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు.

ఫస్ట్‌ లుక్‌లో గడ్డంతో సమంత సరసన కనిపించారు చైతూ. సంక్రాంతి సందర్భంగా సోమవారం ఈ చిత్రం సెకండ్‌ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో చేతిలో బ్యాట్, క్లీన్‌ షేవ్‌తో కనిపించారు చైతూ. అయితే ఈసారి ఫొటోలో సమంత కనిపించడంలేదు. రెండో హీరోయిన్‌గా చేస్తున్న దివ్యాంశ కౌశిక్‌ ఆత్మీయంగా చైతూని హగ్‌ చేసుకుని కనిపిస్తున్నారు. ఇంట్లో ఇల్లాలు సమంత అయితే గ్రౌండ్‌లో ప్రియురాలు దివ్యాంశ అనుకోవాలేమో. అంటే.. ఇదేమైనా ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీయా? ఏప్రిల్‌లో తెలుసుకుందాం. ఈ చిత్రకథ మాత్రం విశాఖపట్నం నేపథ్యంలో ఉంటుందట. రావు రమేశ్, పోసాని కృష్ణముర ళి, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: విష్ణు వర్మ.

మరిన్ని వార్తలు