Vichithra: పేరు కూడా అడగలేదు, గదిలోకి రమ్మని పిలిచాడు.. రోజూ తాగి వచ్చి టార్చర్‌..

22 Nov, 2023 10:56 IST|Sakshi

సీనియర్‌ నటి విచిత్ర తమిళంలో అనేక సినిమాలు చేసింది. సహాయ నటిగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసింది. పెళ్లి తర్వాత సినిమాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టి బుల్లితెరకు షిఫ్ట్‌ అయిన ఈ నటి ఇటీవలే తమిళ బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో పాల్గొంది. 21 ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న ఆమె బిగ్‌బాస్‌ షోలో ఓ షాకింగ్‌ విషయాన్ని బయటపెట్టింది.

సినిమాలు మానేయడానికి కారణమిదే
'అది 2000వ సంవత్సరం.. ఓ దివంగత నటుడు (పేరు చెప్పడం ఇష్టం లేదు) నాకు తెలుగులో ఓ హీరోతో కలిసి నటించే సినిమా ఆఫర్‌ ఇచ్చారు. ఆ మూవీ షూటింగ్‌ కేరళలోని మలంపుళలో జరిగింది. అక్కడే నా భర్త పరిచయమయ్యాడు. అక్కడే నా జీవితంలోనే అత్యంత దారుణమైన క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాన్ని ఎదుర్కొన్నాను. పెళ్లి చేసుకున్నాకే సినిమాలకు గుడ్‌బై చెప్పానని చాలామంది అనుకుంటున్నారు. కానీ అసలు కారణం అది కాదు. షూటింగ్‌లో నేను పడ్డ బాధ, నరకం వల్లే ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయాను. అది ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను.

తెలుగు హీరో తన గదిలోకి రమ్మన్నాడు
ఒక తెలుగు హీరోను, నన్ను 3 స్టార్‌ హోటల్‌లో ఉండమన్నారు. ఆ హోటల్‌ జనరల్‌ మేనేజరే తర్వాత నా భర్తగా మారాడు. ఓ రోజు పార్టీ జరుగుతోంది.. అక్కడే ఆ ఫేమస్‌ హీరోను కలిశాను. అతడు నా పేరు కూడా అడగలేదు, కానీ డైరెక్ట్‌గా గదికి వచ్చేయమన్నాడు. నేను షాకయ్యాను. అతడి మాటను పట్టించుకోకుండా వెళ్లి నా గదిలో నేను పడుకున్నాను. ఆ తర్వాతి రోజు నుంచి షూటింగ్‌లో సమస్యలు చుట్టుముట్టాయి. తమిళ ఇండస్ట్రీలో ఇటువంటి సమస్యలు నాకు ఎప్పుడూ ఎదురవలేదు.

తాగి వచ్చి న్యూసెన్స్‌
ఆ హీరో రోజూ తాగి వచ్చి నా గది తలుపు తట్టేవాడు. ఆ గండం నుంచి ఎలా బయటపడాలా అని భయపడిపోయాను. నా రూమ్‌లో ఉన్న ఫోన్‌కు ఎవరి దగ్గరి నుంచి కాల్స్‌ రాకుండా చూడమని హోటల్‌ సిబ్బందిని వేడుకున్నాను. హోటల్‌ మేనేజర్‌ పరిస్థితి అర్థం చేసుకుని చిత్రయూనిట్‌కు తెలియకుండా రోజుకో గదికి షిఫ్ట్‌ చేశాడు. నేను పాత రూమ్‌లో ఉన్నాననుకుని అతడు తాగి డోర్‌ తట్టేవాడు. ఒకరోజు అతడికి సహనం నశించి నాకు గుణపాఠం చెప్పాలనుకున్నాడు. ఓరోజు అడవిలో షూటింగ్‌ జరుగుతుండగా అతడు నన్ను అసభ్యంగా తాకాడు.

అసభ్యంగా తాకాడు..
డైరెక్టర్‌ రెండో టేక్‌ తీసుకున్నాడు.. మళ్లీ అలాగే నన్ను అసభ్యంగా తడిమాడు. మూడోసారి కూడా అంతే.. ఇక నా వల్ల కాక అతడి చేయి పట్టుకుని లాగి స్టంట్‌ మాస్టర్‌ దగ్గరకు తీసుకెళ్లాను. అతడిని ప్రశ్నించాల్సింది పోయి ఆ స్టంట్‌ మాస్టర్‌ రివర్స్‌లో నా చెంప చెళ్లుమనిపించాడు. అందరూ చూస్తూ నిల్చున్నారే తప్ప ఎవరూ మాట్లాడలేదు. కోపం, ఆవేశం, బాధ.. ఏమీ చేయలేకపోయాను. చెంప మీద దెబ్బ తాలూకు అచ్చులతో యూనియన్‌ దగ్గరకు వెళ్తే ఈ సంఘటనను మర్చిపోమన్నారు. నీకు కనీస గౌరవమర్యాదలు ఇవ్వని చోట ఎందుకు పని చేస్తున్నావు? అని హోటల్‌ మేనేజర్‌ అన్నాడు. అతడు నాకోసం కోర్టులో సాక్షిగా నిలబడ్డాడు.. చాలా పోరాడాడు. నన్ను పెళ్లి చేసుకున్నాడు. నాకు ముగ్గురు అందమైన పిల్లల్ని ఇచ్చాడు' అని చెప్పుకొచ్చింది విచిత్ర.

చదవండి: త్రిషకు క్షమాపణ చెప్పను.. నేను మాట్లాడితే అగ్నిగోళం బద్దలవుతుంది: మన్సూర్‌

మరిన్ని వార్తలు