చేతులెత్తి నమస్కరిస్తున్నా : బాలకృష్ణ

3 Apr, 2020 16:46 IST|Sakshi

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ నివారణకోసం కష్టపడి పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, మున్సిపల్‌ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, రెవెన్యూ అధికారులు, మీడియా ప్రతినిధులకు హీరో నందమూరి బాలకృష్ణ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇంతమంది కష్టపడి పనిచేస్తుంటే.. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో కొన్ని పొరపాట్లు చోటుచేసుకుంటున్నాయని ఆయన అన్నారు. ఇలాంటి పొరపాట్లు జరగవద్దని బాలకృష్ణ చేతులెత్తి నమస్కరించారు. కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ వారి బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. కరోనా వైరస్‌ నియంత్రణ కోసం ప్రతి ఒక్కరు పోరాడాలని కోరుతూ ఆయన శుక్రవారం ఓ వీడియో విడుదల చేశారు.

కంటికి కనబడని కరోనా భూతంతో మనం యుద్ధం చేస్తున్నామని బాలకృష్ణ అన్నారు. భయం వదిలి.. సామాజిక దూరంతో కరోనా చచ్చేవరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కరోనా స్వరనాశనానికి మన వద్ద ఉన్న ఆయుధం సామాజిక దూరం మాత్రమేనని ఆయన అన్నారు. ఆరోగ్య పరిరక్షణ నియమాలు పాటించడమే మనకు రక్ష అని చెప్పారు. ప్రజలందరూ స్వీయ నిర్బంధనలో ఉండి కరోనాను జయించాలని మనస్ఫూర్తిగా కోరకుంటున్నట్టు తెలిపారు. 

అంతకు ముందు కరోనా నియంత్రణ చర్యల కోసం బాలకృష్ణ మొత్తంగా రూ. 1.25 కోట్ల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి రూ. 50 లక్షల చొప్పున అందజేయనున్నట్టు చెప్పారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ కార్మికుల సహాయార్థం 25 లక్షల రూపాయల చెక్‌ను కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఎగ్జిక్యూటివ్ మెంబర్ సీ కళ్యాణ్‌కు అందించారు.

చదవండి : కరోనాపై పోరుకు బాలయ్య విరాళం : చిరు ట్వీట్‌

మరిన్ని వార్తలు