అందుకే నిర్మాతగా మారా!

16 Feb, 2018 00:17 IST|Sakshi
నాని

‘‘తెలుగులో కొత్త సినిమాలు, కొత్త కథలు రావడం లేదని అందరూ అంటున్నారు. నేనూ అలా అనుకోవడం ఎందుకు? మార్పు నా నుంచే మొదలవ్వాలి. నేనే ముందుగా చేస్తే బాగుంటుంది కదా? అనుకొని ‘అ’ చిత్రం తీశా’’ అని హీరో నాని అన్నారు. కాజల్‌ అగర్వాల్, నిత్యా మీనన్, రెజీనా, ఈషా, అవసరాల శ్రీనివాస్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘అ’. ప్రశాంత్‌ వర్మను దర్శకునిగా పరిచయం చేస్తూ వాల్‌ పోస్టర్‌ సినిమా పతాకంపై హీరో నాని సమర్పణలో టి. ప్రశాంతి నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాని పంచుకున్న విశేషాలు..


► ప్రశాంత్‌ వర్మ చెప్పిన కథ చాలా వైవిధ్యంగా ఉంది. తనకు నిర్మాతలు లేరని నేనే ఇద్దరు ముగ్గురు నిర్మాతలకు కథ వినమని చెప్పా. కానీ కమర్షియల్‌ సినిమాలు తీస్తున్న వారు ఇలాంటి కథ తీసేందుకు ముందుకు రారు. అటువంటప్పుడు ప్రశాంత్‌ని ఎందుకు నిరుత్సాహపరచడం. పైగా కథ వైవిధ్యంగా ఉంది కాబట్టి నేనే నిర్మిస్తానని చెప్పా. తనకు అవసరమైన నటీనటులు, టెక్నీషియన్స్‌ని ఇచ్చా.

► హీరోగా కూల్‌గా ఉంటాను. నిర్మాతగానూ టెన్షన్‌ లేదు. నిర్మాతగా ‘అ’ సినిమా చూసినప్పుడు నటుడిగా నా తొలి సినిమా ‘అష్టా చమ్మా’ చూసిన ఫీలింగ్‌ కలిగింది. చాలా హ్యాపీ. అయితే ‘నానీకి ప్రొడక్షన్‌ అవసరమా?’ అంటారేమో అని చిన్న భయం. టాలీవుడ్‌కి ‘అ’ లాంటి సినిమాల అవసరం ఉంది. పైగా తెలుగు ప్రేక్షకులు ఇలాంటి కొత్త సినిమాలు కోరుకుంటున్నారు. అందుకే నాకు ప్రొడక్షన్‌ అవసరం.

► ఓవైపు హీరోగా ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాతో బిజీగా ఉన్నా. మరోవైపు ‘అ’ సినిమా పనుల్లో ఉండటంతో ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపా. సినిమా అంటే నాకు పిచ్చి. ఓ ఎగై్జట్‌మెంట్‌. అందువల్లే నాకు నటన, ప్రొడక్షన్‌ కష్టం అనిపించలేదు. ‘అ’ చిత్రంతో నిర్మాతల కష్టాలేంటో పూర్తి స్థాయిలో తెలిసాయి.
 

► ‘అ’ కమర్షియల్‌ సినిమా కాదు. నాపై నమ్మకంతో సినిమా కొనే డిస్ట్రిబ్యూటర్లను ఎందుకు రిస్క్‌లో పడేయడం? సినిమాపై నాకు నమ్మకం ఉంది. ఆ రిస్క్‌ ఏదో నేనే పడదామనుకుని సొంతంగా రిలీజ్‌ చేస్తున్నా. తమిళ, మలయాళం భాషల్లో డబ్‌ చేసి విడుదల చేస్తున్నాం.  

► మా 18 మంది కజిన్స్‌లో యూజ్‌లెస్‌ ఫెలో నేనే. అటువంటి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది సినిమా. నా వద్ద ఉన్న ప్రతి రూపాయి సినిమా ఇచ్చిందే. ఆ డబ్బుని తిరిగి సినిమాపై పెట్టేందుకు నేను వెనకాడను.

► ‘అ’ సినిమా కమర్షియల్‌గా హిట్‌ సాధించకున్నా పర్లేదు. కానీ.. ఓ ఇరవై ఏళ్ల తర్వాత.. తెలుగులో వైవిధ్యమైన సినిమాలకు ‘అ’ సినిమాతోనే మార్పు ప్రారంభమైంది అంటే చాలు. మా లక్ష్యం నెరవేరినట్లే. వాల్‌పోస్టర్‌ సినిమా బ్యానర్లో కొత్త తరహా చిత్రాలే వస్తాయి. అందుకు రెండు మూడేళ్లు అయినా పట్టొచ్చు.

► నేనిప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే నా దర్శక–నిర్మాతలే కారణం. సొంత బ్యానర్‌ పెట్టాను కదా. నా సినిమాలు నేనే చేసుకుంటానంటానేమో? అనుకుంటారు. నేనెప్పుడూ నటుణ్ణే. నా బ్యానర్‌లో నేనెప్పుడూ నటించను. ‘అ’ విషయంలో నేను నిర్మాతనే. కాజల్, నిత్య, రెజీనా, అవసరాల నటులే. మేమంతా ఫ్రెండ్స్‌ కదా అని రెమ్యునరేషన్‌ తగ్గించలేదు. డేట్స్‌ని బట్టి తీసుకున్నారు.

► ఏడాదికి మూడు సినిమాలతో బిజీ. నేను హీరోగా చేయడంతో పాటు నా పాత జాబ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నా. నా డైరెక్టర్లకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉంటున్నా. యాక్టర్‌గా నా పేరు వేయకున్నా పర్లేదు.. డెరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో నా పేరు వేయమని చెబుతుంటా (నవ్వుతూ).

► శేఖర్‌ కమ్ముల, వెంకీ కుడుముల దర్శకత్వంలో నేను సినిమాలు చేస్తున్నానన్నది అవాస్తవం. మేర్లపాక గాంధీతో ‘కృష్ణార్జున యుద్ధం చేస్తున్నా’. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునగారు, నేను చేయబోయే సినిమా పూజ ఈ నెల 24న ఉంటుంది. మార్చిలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది. తర్వాత కిశోర్‌ తిరుమల, విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో సినిమాలు చేస్తా.

మరిన్ని వార్తలు