వారి విడాకుల విషయం కుంగదీసింది: నటి

5 Mar, 2020 14:44 IST|Sakshi

తన కూతురు మసాబా విడాకుల విషయం తెలిసి తాను విషాదంలో మునిగిపోయానని బాలీవుడ్‌ సీనియర్‌ నటి నీనా గుప్తా అన్నారు. తనపై తీవ్ర ప్రభావం చూపిన విషయం ఇదేనని పేర్కొన్నారు. వెస్టిండీస్‌ క్రికెటర్‌, వివాహితుడైన వివియన్‌ రిచర్డ్స్‌ను ప్రేమించిన నీనా గుప్తా... పెళ్లి కాకుండానే 1989లో కూతురికి జన్మనిచ్చారు. ఆమెకు మసాబాగా నామకరణం చేసి.. తల్లీతండ్రీ తానే అయి అపురూపంగా పెంచుకున్నారు. ఈ క్రమంలో మసాబా ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌గా ఎదిగి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా 2015లో ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ మధు మంతెనను వివాహం చేసుకున్న మసాబా.. రెండేళ్ల క్రితం వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు. మధు, మసాబా ఈ మేరకు 2018 ఆగస్టులో సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కోర్టు మ్యారేజీ ద్వారా పెళ్లి చేసుకున్న తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం బాంద్రా ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. బుధవారం వారికి విడాకులు మంజూరయ్యాయి.(వివాహితుడిని ప్రేమించకండి: నటి)

ఈ విషయం గురించి తాజాగా మసాబా తల్లి నీనా గుప్తా మాట్లాడుతూ.. మధు, మసాబాల విడాకుల గురించి తెలిసి తాను దుఃఖ సాగరంలో మునిగిపోయానని తెలిపారు. ‘‘నిజానికి ఈ విషయం తెలిసిన తర్వాత బాధ నుంచి తేరుకోలేకపోయాను. అప్పుడు మసాబానే నాకు సహాయం చేసింది. నేను అస్సలు ఈ విషయాన్ని అంగీకరించలేకపోయాను. నాపై ఇది తీవ్ర ప్రభావం చూపింది’’అని తన ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా... ‘‘నా కూతురి పెంపకంలో నా తండ్రి నాకు ఎంతగానో సహాయం చేశారు. నా కోసం ఆయన ముంబైకి షిప్ట్‌ అయ్యారు. నా కోసం అంతగా కష్టపడిన నాన్నకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. సింగిల్‌ పేరెంట్‌గా ఉన్న నాకు వెన్నెముకగా నిలిచారు’’ అని తన కూతురి పెంపకంలో ఎదురైన సవాళ్లను గుర్తుచేసుకున్నారు.

కాగా కూతురికి జన్మనిచ్చిన తర్వాత వివియన్‌ రిచర్డ్స్‌, నీనా విడిపోయారు. అనంతరం నీనా గుప్తా పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. బదా యీ హో, సర్వమంగళ్‌ జ్యాదా సావధాన్‌ సినిమాలలో ఇటీవల తెరపై కనిపించారు. ఇక కొన్నిరోజుల క్రితం ఓ వీడియోను విడుదల చేసిన నీనా గుప్తా.. పెళ్లైన వ్యక్తితో ప్రేమలో పడవద్దంటూ తన అనుభవాల గురించి పంచుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు