వాడియా.. రాముడు కాదు కృష్ణుడే!!

17 Jun, 2014 12:02 IST|Sakshi
వాడియా.. రాముడు కాదు కృష్ణుడే!!

ప్రీతి జింటాతో డిష్యుం డిష్యుం అన్నట్లున్న నెస్ వాడియా.. ఇప్పటికీ ఆమె తనకు మంచి స్నేహితురాలే అని చెబుతున్నా, ఇద్దరి మధ్య పరిస్థితి ఎలా ఉందో మాత్రం అందరికీ తెలుసు. మాజీ ప్రియుడు తనను కొట్టాడని, వేధిస్తున్నాడని ప్రీతిజింటా ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసేవరకు వెళ్లింది. అయితే, దాదాపు ఐదేళ్ల పాటు ప్రీతి - వాడియా స్నేహబంధం కొనసాగింది. దానికి ముందు, ఆ తర్వాత, మధ్యలో కూడా నెస్ వాడియా మరికొందరు బాలీవుడ్ భామలతో చెట్టపట్టాలు వేసుకునే తిరిగాడని ముంబై వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

రాక్స్టార్ చిత్రంతో ఒక్కసారిగా తారాపథంలోకి దూసుకెళ్లిన నర్గీస్ ఫక్రీ.. నెస్ వాడియాతో రాసుకు పూసుకుని తిరిగి, వార్తల్లో నిలిచింది. రాక్స్టార్ సినిమా ప్రీమియర్ షో ముగియగానే, కరణ్ జోహార్ పుట్టినరోజు పార్టీలో నర్గీస్ ఫక్రీ అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా హీరో రణ్బీర్ కపూర్ రాకపోయినా.. నెస్ వాడియా రూపంలో ఆమెకు ఆ పార్టీలో మంచి కంపెనీయే దొరికింది. వాళ్లిద్దరూ దాదాపు గంట పాటు ఆ పార్టీలో ఒకరినొకరు అతుక్కుపోయి కనిపించారట. ప్రీతిజింటా కూడా ఆ పార్టీలో ఉన్నా, ఫక్రీ స్థాయిలో ఆమె వార్తల్లో నిలవలేకపోయింది.

ఒకప్పుడు లారా దత్తాతోను, అంతకంటే ముందు మనీషా కొయిరాలాతో కూడా నెస్ వాడియా కాస్త సన్నిహితంగానే మెలిగాడట. అంతేనా, అమీషా పటేల్ అన్నా కూడా వాడియా చెవి కోసుకునేవాడని బాలీవుడ్ వర్గాల్లో గుప్పుమంది. ఇప్పుడు వాళ్లంతా దూరంగా జరగడంతో.. తాజాగా బిజినెస్ టైకూన్ ఆయేషా థాపర్తో వాడియా చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడని వినిస్తోంది.