నోట్ల రద్దు నేపథ్యంలో...

11 Apr, 2019 03:34 IST|Sakshi
అరుళ్‌ కుమార్, బాబీ, వసంత్‌

జీవితంలో ఎదగాలి.. బాగా డబ్బు సంపాదించాలనుకునే ముగ్గురు అబ్బాయిల చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిన చిత్రం ‘క్యాష్‌ క్యాష్‌’. టీజాయ్, శక్తివేల్‌ కాల్కానా, నందు సురేష్, చీను మోహన్, మారిముత్తు, కాళి వెంకట్‌ ముఖ్య తారలుగా అరుళ్‌ కుమార్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. తమిళంలో ‘థట్రోమ్‌ థూక్రోమ్‌’ పేరుతో రూపొందిన ఈ సినిమాని ‘క్యాష్‌ క్యాష్‌’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో నోట్ల రద్దు నేపథ్యంలో సాగే తొలి పాటను దర్శకుడు బాబీ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ పాట వినగానే నోట్ల రద్దు సమయంలో ఎదుర్కొన్న కొన్ని వాస్తవిక పరిస్థితులు గుర్తుకొచ్చాయి. ప్రజలు ఎదుర్కొన్న సమస్యల ఆధారంగా తీసిన ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు. 

‘‘క్రేజీ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ ఇది. దేశ ప్రజలు నోట్ల రద్దు వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారు?  అనే నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ పాటను తమిళంలో శింబు పాడారు. ఒక ఉద్రేకంతో జనంలోకి వెళ్లింది. తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు అరుళ్‌ కుమార్‌. ‘‘నోట్ల రద్దు టైంలోని పరిస్థితుల గురించి పాట రాయాలి, ఓ గీత రచయిత ఉంటే చెప్పండని చిత్రబృందం అన్నప్పుడు.. అప్పటి పరిస్థితులు ఎదుర్కొన్నవాడిగా నేనెందుకు ఈ పాట రాయకూడదు? అనిపించింది. అలా తెలుగులో మొట్టమొదటిసారిగా ఈ సినిమా కోసం ఓ పాట రాశా’’ అని సంగీత దర్శకుడు డీజే వసంత్‌ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: బాలమురళి బాలు, కెమెరా: ఎన్‌. సతీష్‌ మురుగన్‌.

మరిన్ని వార్తలు